రాజమండ్రి ఎంపీ త్రిముఖ పోరులో గెలుపెవరిది..?

రాజమండ్రి ఎంపీ త్రిముఖ పోరులో గెలుపెవరిది..?
x
Highlights

మూడు ప్రధాన పార్టీలు....మూడు బలమైన సామాజికవర్గాల అభ్యర్థులు...ట్రయాంగిల్‌ వార్. ఎవరి ఓట్లు, ఎవరు చీల్చారో, ఏమేరకు గండికొట్టారోనన్న అంచనాలు. నరాలు తెగే...

మూడు ప్రధాన పార్టీలు....మూడు బలమైన సామాజికవర్గాల అభ్యర్థులు...ట్రయాంగిల్‌ వార్. ఎవరి ఓట్లు, ఎవరు చీల్చారో, ఏమేరకు గండికొట్టారోనన్న అంచనాలు. నరాలు తెగే టెన్షన్. గుండె వేగం పెంచే ఉత్కంఠ. చారిత్రక, సాంస్కృతిక నగరి, రాజమండ్రి పార్లమెంటు ఎన్నికపై అనేక ఊహాగానాలు, అంచనాలు. మరి మూడు పార్టీలకూ కీలకమైన రాజమహేంద్రిలో ఎవరి అంచనాలేంటి?

గోదావరి పరవళ్లు, పచ్చని తివాచీ పరచినట్టుగా పొలాలు, ఆర్థికంగా బలమైన ప్రాంతం, చుట్టుపక్కల జిల్లాలకు వాణిజ్య కేంద్రం, ఖరీదైన, పసందైన రాజకీయం రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం. ఈసారి కూడా రసపట్టులా ఉంది రాజమండ్రి పొలిటికల్‌ సీన్. పాతవారు కాకుండా కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగడంతో, అందరిలోనూ ఆసక్తి మరింత పెరిగింది.

తెలుగుదేశం సిట్టింగ్ ఎంపీ మురళీ మోహన్‌, ఈసారి పోటీ చేయకపోవడంతో, ఆయన కోడలు మాగంటి రూపను అనూహ్యంగా తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ఇక వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే అడుగులేసింది. రాజమండ్రిపై బీసీ కార్డును ప్రయోగించింది. మార్గాని భరత్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అటు జనసేన సైతం, బలమైన క్యాండెట్‌ను రణక్షేత్రంలో దింపింది. కాపు కులాల లెక్కలతో ఆకుల సత్యనారాయణను తెరపైకి తెచ్చింది. ట్రయాంగిల్‌ వార్‌‌తో అత్యంత ఉత్కంఠ కలిగిస్తోంది రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నిక.

అయితే తెలుగుదేశం అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప పేరును ప్రకటించడంలో ఆ పార్టీ అధిష్టానం కొంత ఆలస్యం చేసింది. నామినేషన్‌కు ఆఖరురోజున రూప పేరు ఖరారు కావడంతో హడావిడిగా నామినేషన్ దాఖలు చేసి, జనంలోకి వెళ్లడానికి కాస్తంత సమయం పట్టింది. ఎంపీ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేసిన గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ ఈ పరిణామాలుపై కాస్తంత అసంతృప్తికి గురయ్యారు. తర్వాత చంద్రబాబు ఆదేశాలతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్లమెంటు సమన్వయకర్తగా ప్రచారం నిర్వహించారు. ఇవన్నీ చక్కదిద్దుకుని ప్రచారంలోకి వచ్చేసరికి ఎంపీ అభ్యర్థిగా రూప ప్రచారంలో కొంతవరకూ వెనకబడ్డారనే చెప్పాలి.

ఐదేళ్లుగా సిట్టింగ్ ఎంపీగా వున్న మాగంటి మురళీమోహన్ అందరికీ అందుబాటులో లేరన్న ప్రచారం, పోటీ చేయనని ప్రకటించి తిరిగి తన కోడలను రంగంలోకి దించడంతో పార్టీ కేడర్‌లో గందరగోళ పరిస్థితులకు దారితీశాయి. ప్రచారానికి వెళ్లిన చోట రూపకు కూడా ఈ పరిణామాలుపై చేదు అనుభవాలు కొన్ని చోట్ల ఎదురయ్యాయి. ఒక మహిళగా, పారిశ్రామిక వేత్తగా నియోజకవర్గం అభివృద్దికి కృషి చేస్తానని ప్రచారంలో చెప్పుకొచ్చారు రూప. అయితే పార్టీ కేడర్‌లో అన్ని చోట్లా ఆమెకు కలిసివచ్చినట్టుగా కన్నించలేదు. పలు నియోజకవర్గాలలో మాగంటి కుటుంబానికి వ్యతిరేకంగా పార్టీలో కొందరు పనిచేశారనే విమర్శలు విన్పించాయి.

రాజమండ్రి పార్లమెంటు జనసేన అభ్యర్థిగా సిట్టంగ్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రచారంలో అంత ఆర్భాటం చేయలేదు. తెలుగుదేశం, బిజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బిజేపీ తరపున 2014లో పోటీ చేసి గెలుపొందిన ఆకుల సత్యనారాయణ, బిజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అయితే తన పార్లమెంటు నియోజకవర్గంలో రెండు మూడు చోట్ల తను సూచించిన వారికి కాకుండా వేరొకరికి అసెంబ్లీ అభ్యర్థిత్వాలు ఖరారు చేయడంతో ఆకుల అసంతృప్తికి లోనయ్యారు. అయితే అది బయటపడనీయకుండా తన ప్రచార స్టయిల్‌ను మార్చుకున్నారు. తన ప్రచారాన్ని కేవలం గ్రామాలు, మండలాల యూనిట్‌గా చేసుకుని ఒక వ్యూహాం ప్రకారం క్యాంపెయిన్ చేశారు. అసెంబ్లీ అభ్యర్ధులతో కలిసి ర్యాలీలు, సభలలో పాల్గొన్నా, తాను ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాలేవీ నిర్వహించలేదు. దీంతో ఆకుల తీరుపై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులు అసంతృప్తితో రగిలిపోయారు.

కాపు సామాజికవర్గానికి చెందిన ఆకుల సత్యనారాయణ ఆ సామాజికవర్గం ఓటు బ్యాంకుపై ఆధారపడి క్యాంపెయిన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలో వున్నా కాపులైనా తన వరకూ ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాస్‌పై ఓటేస్తారనే నమ్మకం, దీమాతో ఆకుల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో కాపులు, బీసీల ఓటు బ్యాంకు అధికంగానే వుంది. జనసేన అభ్యర్థి ఆకుల తన సామాజికవర్గం నుంచి క్రాస్ ఓటింగ్ బాగా జరిగి, తన గెలుపునకు మేలు చేస్తుందనే నమ్మకంతో వుండగా, అంతే దీమాతో వైసీపీ అభ్యర్థి యువ బిసీ నాయకుడు మార్గాని భరత్ రామ్ ఉన్నారు.

కాపు సామాజికవర్గం అధికంగా జనసేనకు ఓటేస్తారనే అంచనాతో ఆకుల, బిసీ సామాజికవర్గం ఎక్కువ శాతం తెలుగుదేశానికి అనుకూలమైనా, పార్లమెంటు వరకూ క్రాస్ ఓటింగ్ వేస్తారనే నమ్మకంతో మార్గాని భరత్ రామ్ లెక్కలు వేసుకున్నారు. వైసీపీకి అధిక శాతం ఎస్సీ సామాజికవర్గం ఓట్లు పడితే, దానికి తోడు బిసీ ఓట్లు అధికశాతం క్రాస్ ఓటింగ్ జరిగితే, గెలుపు తనదేనన్న అంచనాలతో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ప్రచారం సాగింది. ఇటు మార్గాని భరత్ రామ్, అటు ఆకుల సత్యనారాయణలు క్రాస్ ఓటింగ్, సొంత సామాజిక ఓటు బ్యాంకుపై ఎక్కువగా ఆశలు పెంచుకుని ప్రచారం నిర్వహించారు.

రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు తనదంటే తనదేనంటూ ప్రధాన పార్టీలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ వల్లే తమ గెలుపు సాధ్యమవుతుందని ఇటు జనసేన అభ్యర్థి ఆకుల సత్యనారాయణ, అటు వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ అంచనాలు మీద అంచనాలు వేసుకుంటున్నారు. మహిళలు తమ వెంటే వున్నారని, తామే గెలుస్తున్నామని తెలుగుదేశం అభ్యర్థి మాగంటి రూప, పోలింగ్ శాతంపై కూడికలు తీసివేతలు వేసుకుంటున్నారు. క్రాస్‌ ఓటింగ్ నిజంగా అంత ఎఫెక్ట్ చూపిస్తుందా?

2014లో సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీ మోహన్ తెలుగుదేశం అభ్యర్థిగా లక్షా 67వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మురళీమోహన్, లక్షా 17 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే 2014లో పార్లమెంటులో ఏడు అసంబ్లీ స్థానాలలో ఏడు కూడా తెలుగుదేశం, దాని మిత్రపక్షం బిజేపీకే వచ్చాయి. అలాగే అప్పట్లో జనసేన పూర్తి మద్దతు తెలుగుదేశానికి ఇవ్వడమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలలో తెలుగుదేశానికి, బిజేపీకి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇపుడైతే బిజేపీ, తెలుగుదేశానికి గుడ్ బై చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీలోకి దిగడంతో అనేక నియోజకవర్గాలలో రసవత్తర పోటీ ఏర్పడటం, పోటీ త్రిముఖంగా మారడంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఆందోళన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులలో నెలకొంది. పవన్ కళ్యాన్ ఎవరి ఓట్లకు చిల్లుపెట్టారోనన్న చర్చ నడుస్తోంది. అదే అభ్యర్థుల విజయావకాశాలను డిసైడ్ చేస్తుందన్న విశ్లేషణ సాగుతోంది.

రాజమండ్రి పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశానికి మూడు, వైసీపీకి మూడు, ఒకటి జనసేనకు అనుకూలంగా వున్నాయని బెట్టింగ్ రాయుళ్లు, సర్వేసంస్థల అంచనాలున్నాయి. నాలుగు తెలుగుదేశం, మూడు వైసీపీకి వస్తాయని లెక్కలేసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలలో క్రాస్ ఓటింగ్‌లో గెలుపు దీమాలో అటు జనసేన, ఇటు వైసీపీ అభ్యర్థులుండగా, తెలుగుదేశం అభ్యర్థి మాత్రం మహిళా ఓటర్లు తనకు అనుకూలంగా ఓటేశారనే ఆశాభావంతో వున్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలలో తక్కువగా ఓట్లశాతం నమోదు కాగా, మిగిలిన ఐదు నియోజకవర్గాలలో 85శాతం దాటి పోలింగ్ జరగడంతో ఎంపీ సీటు తమదేనని తెలుగుదేశం నేతల కాన్ఫిడెన్స్. ఎవరి దీమా వారు వ్యక్తం చేస్తున్న రాజమండ్రి పార్లమెంటులో, ప్రజలు తీర్పు, ఈవీఎంలలో ఏమని నిక్షిప్తమయ్యిందో తెలియాలంటే మే23 వరకూ వేచిచూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories