పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీ కాంగ్రెస్ నేతలు...అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు

పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీ కాంగ్రెస్ నేతలు...అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్ష...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించి ఎన్నికల వ్యూహలపై చర్చించారు ఆ పార్టీ నేతలు. తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లు సాధించి రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వాలని నిర్ణయించిన నేతలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేపడుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. పార్లమెంటరీ పార్టీ సన్నాహాక సమావేశాల్లో పాల్గొన్న నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఒక్క ఓటు కూడా నష్టపోకుండా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించ సరైన విధంగా పని చేయాలని పార్టీ దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ అభ్యర్ధుల ఎంపికలో డీసీసీ అధ్యక్షుల సిఫారసులను పరిగణలోకి తీసుకుని అభ్యర్ధుల పేర్లు ఖరారు చేయాలని నిర్ణయించారు. జిల్లాల్లోని ముఖ్యనేతలతో చర్చించి నియోజకవర్గానికి నలుగురి పేర్లతో ప్రతిపాదనలు పంపించాలని డీసీసీ అధ్యక్షులు సూచించిన పేర్లను ఏఐసీసీకి పంపించనున్నట్లు పీసీసీ నేతలు చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై చర్చించిన నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం వైపు నుంచి జరిగిన వైఫల్యాలను పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అభ్యర్థుల ఖరారుపైనే లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నారు. ముఖ్యంగా స్థానికులకు ఆర్ధిక బలం ఉన్నవారికి టిక్కెట్లు ఇవ్వాలన్నారు. వయోభారం పై బడిన వారికి టికెట్లు ఇవ్వొద్దని సూచించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిన వారికి మరో మారు అవకాశం ఇచ్చి పోటీ చేసే అవకాశం రాని వారికి మళ్లీ అన్యాయం చేయవద్దని మెజార్టీ నేతలు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.

గత ఎన్నికల్లో పోలిస్తే ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌వైపు నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని, రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని భావిస్తున్నారని అన్నారు ఉత్తమ్. తెలంగాణ కాంగ్రెస్ మొదలు పెట్టిన వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో ఏ ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక జరుగుతుందో మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories