పార్లమెంటులోకి ముగ్గురు తెలుగు నటులు..

పార్లమెంటులోకి ముగ్గురు తెలుగు నటులు..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో పలువురు సినీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు గెలిచి..పార్లమెంటు, అసెంబ్లీలో అడుగు పెడుతుండగా.....

సార్వత్రిక ఎన్నికల్లో పలువురు సినీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు గెలిచి..పార్లమెంటు, అసెంబ్లీలో అడుగు పెడుతుండగా.. మరికొందరికి మాత్రం ఈ ఎన్నికలు తీవ్ర నిరాశకు గురిచేసాయి. తెలుగు సినిమా తెరపై తళుక్కుమన్న నటీ నటులు.. తమ నటనతో అభిమానుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి పోటీ చేసి సత్తా చాటుకున్నారు. తొలిసారిగా ముగ్గురు నటులు పార్లమెంట్ గడపతొక్కబోతున్నారు.

తెలుగు సినిమా రంగంలో ఓ మెరుపు మెరిసిన నటీ నటుల్లో పలువురు రాజకీయ రంగంలోనూ తమదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వేర్వేరు పార్టీల తరపున పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగు నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు విజయం సాధించగా మరికొందరు పరాజయం పాలయ్యారు. ముగ్గురు తెలుగు నటులు తొలిసారిగా పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు. శ్రుతిలయలు, ఖైదీ, గ్యాంగ్‌లీడర్‌ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన సుమలత తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టబోతున్నారు. కర్ణాటకలోని మాండ్యా లోక్ సభ స్థానంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సీఎం కుమార స్వామి తనయుడు నిఖిల్ గౌడ్ పై సంచలన విజయం సాధించారు.

యమదొంగ, శ్రీను వాసంతి లక్ష్మీ, మహారథి వంటి చిత్రాల్లో నటించిన నవనీత్‌ కౌర్‌ మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. శివసేన సిట్టింగ్ ఎంపీ ఆనంద్ రావ్ పై యువ స్వాభిమాని తరపున పోటీ చేసిన నవనీత్ కౌర్ 30 వేల మెజార్టీతో గెలిచారు. బాలీవుడ్‌లోనూ అద్భుత నటనతో అలరించిన ఆమె మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకున్నారు. భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన కౌర్ ఎంపీగా గెలుపొందారు.

రేసు గుర్రం చిత్రంలో విలన్‌గా నటించిన రవికిషన్‌ యూపీలో కీలక నియోజకవర్గమైన గోరఖ్‌లోపూర్‌లో 3 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇక్కడి నుంచి ఐదు సార్లు విజయం సాధించారు. భోజ్‌పురీ, బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌ సహకారంతో బీజేపీ తరఫున భారీ విజయాన్ని నమోదు చేశారు.

ఓడిపోయిన వాళ్ల విషయానికొస్తే..రామ్ పూర్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన జయప్రద తన సమీప ప్రత్యర్ధి ఆజాంఖాన్‌పై ఓడిపోయారు. అటు బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ఇక ఏపీ నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు పరాజయం పాలయ్యారు. వైసీపీ తరుపున నగరి నుంచి పోటీ చేసిన రోజా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే, బాలకృష్ణ తన పట్టు నిలుపుకుని విజయం సాధించారు. మొత్తానికి ఈ ఎన్నికలు కొంత మంది నటులకు ఖేదాన్ని మిగిలిస్తే మరికొందరికి మోదాన్ని కలిగించాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories