తొలి కేబినెట్ సమావేశంలో రైతులపై వరాల జల్లు

తొలి కేబినెట్ సమావేశంలో రైతులపై వరాల జల్లు
x
Highlights

కేంద్ర కేబినేట్‌ తొలి సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు....

కేంద్ర కేబినేట్‌ తొలి సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇచ్చేలా.. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద మరో 2 కోట్ల మంది రైతులను తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం ద్వారా దేశంలోని 14.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద మూడు విడతల్లో మొత్తం 6 వేలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారు. దీనికోసం కేంద్రం ఏటా 87 వేల కోట్లు ఖర్చు చేయనుంది.

అలాగే కేంద్ర కేబినేట్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రధానమంత్రి కిసాన్‌ పెన్షన్‌ యోజన పథకానికి ఆమోదం తెలిపారు. 60 ఏళ్లు వయస్సు నిండిన రైతులకు పింఛను ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. దేశంలోని 3 కోట్ల మంది సన్న, చిన్నకారు రైతులు ఈ పథకం కిందకు వస్తారని తెలిపారు. దీని కింద నెలకు 3 వేలు పెన్షన్‌ ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని చిరువ్యాపారులకు కూడా అమలు చేస్తున్నారు. దీనికోసం.. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న రైతులు, చిరువ్యాపారులు నెల నెలా 55 రూపాయల ప్రీమియం కట్టాలని.. దీనికి కేంద్రం అధనంగా 55 రూపాయల ప్రీమియం చెల్లిస్తుంది. 60 ఏళ్లు నిండాక.. నెలకు 3 వేల పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 3 లక్షల 25 పెన్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

భారత రక్షణ నిధి ద్వారా ఉపకార వేతనాలు అందజేసే కార్యక్రమం.. ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌ పథకాన్ని మరింత విస్తృతం చేశారు. ఇప్టటివరకు కేంద్ర పారామిలటరీ బలగాలకు మాత్రమే అందిస్తున్న ఉపకార వేతనాలను.. రాష్ట్ర పోలీసు విభాగానికి కూడా వర్తించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2 వేలుగా ఉన్న బాలుర స్కాలర్‌షిప్‌లను.. 2 వేల 500 లకు.. అలాగే బాలికలకు 2 వేల 250 నుంచి 3 వేలకు పెంచారు. ప్రతీ రాష్ట్రం నుంచి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగం పిల్లలను ఎంపిక చేసి.. వారికి ఉపకార వేతనాలు అందిస్తారు.

మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 17 నుంచి జులై 26 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్‌ 19 న స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 20 న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. జులై 4 న ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. జులై 5 న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories