శ్రీలంకలో పండుగ రోజు మారణహోమం

శ్రీలంకలో పండుగ రోజు మారణహోమం
x
Highlights

శ్రీలంకలో మారణహోమం జరిగింది. వరుస బాంబు పేలుళ్లతో కొలంబో చిగురుటాకులా వణికిపోయింది. 8చోట్ల జరిగిన దాడుల్లో సుమారు 190 మంది చనిపోయారు. వందలాది మంది...

శ్రీలంకలో మారణహోమం జరిగింది. వరుస బాంబు పేలుళ్లతో కొలంబో చిగురుటాకులా వణికిపోయింది. 8చోట్ల జరిగిన దాడుల్లో సుమారు 190 మంది చనిపోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 35మంది విదేశీయులున్నారు. పవిత్ర ఈస్టర్‌ రోజు వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్ధరిల్లింది. చర్చిలు, పలు హోటళ్లతో పాటు పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు.ఈస్టర్‌ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చిలే లక్ష్యంగా ముష్కర మూకలు రెచ్చిపోయి మారణహోమం సృష్టించాయి. పేలుళ్ల ధాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో శ్రీలంకలో భయానక వాతావరణం ఏర్పడింది.

శ్రీలంక కాలమానం ప్రకారం ఉదయం 8.45గంటల సమయంలో మూడు చర్చిలపై దాడులకు తెగబడ్డారు. సెయింట్‌ ఆంథోనీ చర్చిలో మొదటి పేలుడు జరగ్గా.. సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో రెండో బాంబు పేలింది. మూడో పేలుడు బట్టికలోవ ప్రాంతంలోని చర్చిలో జరిగింది. అలాగే ఫైవ్‌స్టార్‌ హోటళ్లే లక్ష్యంగా బాంబు దాడులు చేశారు. తొలుత ఆరు ప్రాంతాల్లో బాంబు దాడులు జరగ్గా.. మధ్యాహ్నం తర్వాత మరో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి.

బట్టికలోవ ప్రాంతంలో ఈస్టర్‌ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగే పేలుడులో మృతిచెందినవారిలో అత్యధికులు చిన్నారులే ఉన్నారు. క్షతగాత్రులను బట్టికలోవ టీచింగ్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి తమిళనటి రాధికా శరత్‌కుమార్‌ తృటిలో తప్పించుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నట్టు ట్విటర్‌లో ఆమె వెల్లడించారు.

పేలుళ్ల ఘటనలతో కొలంబోలో పెను విషాదం అలముకుంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాలు, ఆస్పత్రుల వద్ద అంతులేని ఉద్వేగ వాతావరణం నెలకొంది. పేలుళ్ల ధాటికి చర్చిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పైకప్పులు కుప్పకూలిపోయాయి. జనం కూర్చునే బల్లలన్నీ తునాతునకలయ్యాయి. వరుస బాంబు పేలుళ్లు శ్రీలంకను పెను విషాదంలో ముంచాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories