నిప్పుల కుంపటి

నిప్పుల కుంపటి
x
Highlights

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు...

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మండే ఎండలకు తోడు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగాలులతో జనం విలవిలలాడిపోతున్నారు.

ఉదయం 7గంటల ముందు నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఇంటి నుంచి బయటకు కాలు పెట్టేందుకు జనం జంకుతున్నారు. రోజువారీ పనులు చేసుకునే కూలీల పరిస్థితి దారుణంగా మారింది. అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు వడదెబ్బకు గురవుతున్నారు. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో 45 నుంచి 45.8డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పలుచోట్ల వడగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, హన్మకొండ, భద్రాచలం, హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువయ్యాయి. సోమవారం నెల్లురులో గరిష్ఠంగా 45.9డిగ్రీలు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 44నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత రికార్డైంది. ఉదయం ఎండలు దంచికొడుతుంటే రాత్రిళ్లు వేడి సెగలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుండటంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండకాలం ఎప్పుడు పోతుందా అని నిట్టూర్చుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories