పల్లెలకు సంక్రాంతి అందాలు...భోగితో మొదలైన సంక్రాంతి సంబరాలు

bhogi festival
x
bhogi festival
Highlights

సాధారణంగా పండుగంటే ఒక్కరోజుతోనే ముగిసిపోతుంది కానీ సంక్రాంతి మాత్రం ముచ్చటగా మూడు రోజులు జరుగుతుంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ. భోగ భాగ్యాలను ప్రసాదించేది భోగి అయితే సిరులకాంతులు వెదజల్లే పండుగ సంక్రాంతి.

సాధారణంగా పండుగంటే ఒక్కరోజుతోనే ముగిసిపోతుంది కానీ సంక్రాంతి మాత్రం ముచ్చటగా మూడు రోజులు జరుగుతుంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ. భోగ భాగ్యాలను ప్రసాదించేది భోగి అయితే సిరులకాంతులు వెదజల్లే పండుగ సంక్రాంతి. ఇక పాడిపంటల పండుగ కనుమ. ఈ మూడు పండుగలను తెలుగునాట ఎంతో వేడుకగా జరుపుకుంటాం. నూతన వస్త్రాలు, పిండివంటలు, కొత్త అల్లుళ్లు. కోడి పందాలు ఇలా సంబరమంతా సంక్రాంతి పండుగలోనే ఉంటుంది. ఈ సందడి ఇవాళ భోగితో మొదలైంది.

సంక్రాంతి అందాలు చూడాలంటే పల్లె లోగిళ్లలోనే చూడాలి. వంకలు తిరిగిన వాగులు. మంచు బిందువులతో దోబూచులాడుతూ సూర్యకాంతికి తొంగిచూస్తున్న పైరులు. ఆ ప్రకృతి కాంతతో పోటీ పడుతూ పట్టంచు పరికిణీలు సింగారించుకొని పరుగులు తీసే భామల అందాలు ఇలాంటి సోయగాలన్నీ తిలకించాలంటే పల్లెటూళ్లకు పరుగులు తీయాల్సిందే. అందుకే సంక్రాంతి పండుగంటే చాలు పిల్లల నుంచి పెద్దల దాకా పట్టణాలొదిలి పల్లెలకు పరుగులు పెడుతుంటారు.

తొలి రోజైన భోగినాడు తెలతెలవారకముందునుంచే ఊరు వెలుగును సంతరించుకుంటుంది. ఎక్కడెక్కడి పాత సామానును తెచ్చి భోగిమంటల్లో వేసేస్తారు. ఉప్పొంగే ఉత్సాహంతో ఉరకలెత్తే యువతరాన్ని భోగినాట ఆపడం అసాధ్యమే. భోగి రోజు చిన్న పిల్లలున్న ఇళ్లలో సందడే సందడి. భోగిపళ్లు పోసి , గొబ్బియళ్లు పెట్టిస్తారు. రేగుపళ్లు , చెరకు గడలు, చిల్లర డబ్బులు తలమీదనుంచి పోస్తూ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించమంటూ ఇంటికొచ్చిన ముత్తయిదువులు ఆ పిల్లలను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆనవాయితీ ఉన్నవారు బొమ్మలకొలువులను కూడా పెట్టిస్తుంటారు.

ఇక రెండవ నాడైన సంక్రాంతి పెద్దలపండుగ. ఈ రోజున పితృదేవతకు నివేదనలు చేస్తారు. ఇంటిల్లపాదీ కొత్తబట్టలు ధరించి పండుగ చేసుకుంటారు. ఇళ్లకొచ్చిన ఆడపడుచులతో , కొత్తల్లుళ్లతో , చిన్నపిల్లలతో ప్రతీ ఇల్లూ నిండుగా వెలిగిపోతూ ఉంటుంది. ప్రతీ లోగిలీ కళకళలాడుతూ ఉంటుంది. ఇక మూడవరోజైన కనుమ పాడిపంటల పండుగ. పంటలు ఇంటికొచ్చి గాదెలు నిండుగా ఉన్న తరుణాన ఆ సంతోషంలో పాడి పశువులకు, యంత్రాలకు రైతులు పూజలు నిర్వహిస్తారు. సంక్రాంతి మూడు రోజులూ పల్లెల్లో కోడి పందాలతో సందడి చేస్తే పట్టణాల్లో పంతంగులు ఎగురవేసి ఆనందపడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories