ఎంపీ కవిత చొరవ.. ఇరాక్ నుంచి సొంతగూటికి 14 మంది తెలంగాణ వాసులు!

ఎంపీ కవిత చొరవ.. ఇరాక్ నుంచి సొంతగూటికి 14 మంది తెలంగాణ వాసులు!
x
Highlights

అసలే దేశం కాని దేశం బతుకుదెరువు కోసం వెళ్లి ఏజెంటు చేతిలో దారుణంగా మోసపోయారు. డబ్బు సంపాదించాలని ఎంతో ఆశతో వెళ్తే పని కల్పించకపోగా ఆ ఏజెంట్ వారి వద్ద...

అసలే దేశం కాని దేశం బతుకుదెరువు కోసం వెళ్లి ఏజెంటు చేతిలో దారుణంగా మోసపోయారు. డబ్బు సంపాదించాలని ఎంతో ఆశతో వెళ్తే పని కల్పించకపోగా ఆ ఏజెంట్ వారి వద్ద ఉన్న డబ్బులు తీసుకుని పరారయ్యాడు. దీంతో తినడానికి తిండి లేక బాగ్దాద్‌లో చీకటి గదిలో బందీలుగా ఉండిపోయారు. ఆఖరికి ఎంపీ కవిత సాయంతో స్వదేశానికి చేరుకున్నారు గల్ఫ్ బాధితులు.

స్థానికంగా ఉపాధి లేక, తినడానికి తిండి లేక అప్పుల్లో కూరుకుపోయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన 14 మంది రైతులు గల్ఫ్ దేశాలకు వెళ్లి దారుణంగా మోసపోయారు. ఇరాక్‌లో పని కల్పిస్తానని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ వారిని నట్టేట ముంచేశాడు. దీంతో ఐదు నెలలుగా నరకయాతన అనుభవించారు. తిండి కూడా లేకుండా చీకటి గదిలో బంధీలుగా ఉన్నారు. జీవితంపై ఆశలు వదులుకున్న ఆ రైతులు నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతో ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నారు.

బర్ల నరేందర్ అనే ఏజెంట్ ఇరాక్‌లో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షన్నర చొప్పున వసూలు చేశాడు. 14 మంది నుంచి డబ్బులు దండుకుని విజిటింగ్ వీసాపై ఇరాక్ పంపించాడు. తీరా వెళ్లాక దేశం కాని దేశం. అక్కడి భాష అర్ధం కాదు. ఏజెంటు చెప్పిన వ్యక్తి కలవలేదు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో నానా అవస్థలు పడ్డారు.

ఇరాక్ వెళ్లిన బాధితులు అక్కడి నుంచి తమను పంపించిన ఏజెంట్‌ నరేందర్‌ను సంప్రదిస్తే విజయ్‌చారి అనే ఏజెంట్‌ను వారి వద్దకు పంపించాడు. నెల రోజుల పాటు అటూ ఇటూ తిప్పించిన విజయ్‌చారి మరో 50వేలు ఇస్తే నెలకు 40 వేలు జీతం వచ్చే జాబ్ గ్యారెంటీ అని చెప్పి వసూలు చేశాడు. తీరా డబ్బులు దండుకుని ఎలాంటి పని కల్పించకుండా డబ్బులతో ఉడాయించాడు. దీంతో ఉద్యోగంలేక, తినడానికి తిండి లేక ఇరాక్‌లో బందీలుగా ఉండిపోయారు.

అయితే, వీరి వ్యథపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన ఎంపీ కవిత వారిని స్వస్థలాలకు రప్పించేలా చర్యలు తీసుకున్నారు. కేంద్ర విదేశాంగశాఖ, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై వ్యవహారాలశాఖతో సమన్వయం చేసుకొని ఇరాక్ రాయబార కార్యాలయంతో సంప్రదించి ఎట్టకేలకు వారిని ఇళ్లకు చేర్చారు. ఎంపీ కవిత చొరవతో గల్ఫ్ బాధితులు ఇళ్లకు చేరడంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories