ఎగ్జిట్‌ ఫలితాలతో ఢీలా పడ్డ తెలంగాణ కాంగ్రెస్...ఈ ఎగ్జీట్ పోల్స్ నిజమైతే...

ఎగ్జిట్‌ ఫలితాలతో ఢీలా పడ్డ తెలంగాణ కాంగ్రెస్...ఈ ఎగ్జీట్ పోల్స్ నిజమైతే...
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో షాక్‌ తిన్నారు. లోక్‌సభ ఎన్నికలైనా బతికిస్తాయని భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలో బాగానే కష్టపడ్డారు. కానీ ఎగ్జిట్‌ పోల్స్‌...

అసెంబ్లీ ఎన్నికల్లో షాక్‌ తిన్నారు. లోక్‌సభ ఎన్నికలైనా బతికిస్తాయని భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలో బాగానే కష్టపడ్డారు. కానీ ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం అందుకు విరుద్ధంగా రావడం ఆ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఒరిజినల్‌ ఫలితాలు ఎలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో నైరాశ్యం నెలకొంది.

ఎన్నికల్లో వరుస ఓటములు, పార్టీ ఫిరాయింపులతో చతికిలపడ్డ తెలంగాణ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. 17 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధిస్తామని తొలినుంచీ చెబుతున్నా కనీస స్థానాల్లో గెలుపు ఖాయం అని పీసీసీ నాయకత్వం ధీమా వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్లే ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్‌ బరిలో పెద్ద తలకాయలే నిల్చున్నారు.

అయితే ఆదివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితిని పెనం మీది నుంచి పొయ్యిలో పడేసినట్లుగా మారింది. మల్కాజ్‌గిరి, భువనగిరి, చేవేళ్ల స్థానాల్లో పాగా వేస్తామని భరోసాగా ఉన్న ఆ పార్టీకి ఆదివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ తీవ్ర నిరాశకు గురిచేశాయి. అనేక జాతీయ ఛానెళ్లు కాంగ్రెస్‌కు ఒక్క స్థానమే కట్టబెట్టాయి. దీంతో ఆ స్థానమేంటనే దానిపై ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఎగ్జిట్‌పోల్స్‌ను నమ్మేది లేదని 23 న విడుదలయ్యే ఫలితాల్లోనే తెలుస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు వీహెచ్‌ అన్నారు. తమకు 3 నుంచి 4 స్థానాలు సాధిస్తామని వ్యాఖ్యానించారు.

మూడు నుంచి నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్రంలో కనీసం పార్టీని బతికించుకోవచ్చనే ఆశతో ఉన్న పీసీసీ నాయకత్వంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రతికూలంగా రావడంతో ఏం చేయాలో తెలియని నిరాశలో ఉంది. ఒకవేళ ఈ ఎగ్జీట్ పోల్స్ నిజమైతే తెలంగాణలో హస్తం పార్టీ కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డట్లే అని ఆ పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories