కుదేలవుతున్న కాంగ్రెస్‌ కంచు కోటలు...అసలు కాంగ్రెస్‌లో ఉండేది ఎందరు..?

కుదేలవుతున్న కాంగ్రెస్‌ కంచు కోటలు...అసలు కాంగ్రెస్‌లో ఉండేది ఎందరు..?
x
Highlights

పార్టీ ఫిరాయింపులతో తెలంగాణ కాంగ్రెస్‌ కుదేలవుతోంది. ఊహించని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎప్పుడు ఎవరు గాంధీభవన్‌ను వీడి ప్రగతిభవన్‌ డోర్‌...

పార్టీ ఫిరాయింపులతో తెలంగాణ కాంగ్రెస్‌ కుదేలవుతోంది. ఊహించని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎప్పుడు ఎవరు గాంధీభవన్‌ను వీడి ప్రగతిభవన్‌ డోర్‌ కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎనమిది మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుతామంటూ ప్రకటించగా ఆ దారిలోనే మరికొందరు క్యూలో ఉన్నారనే వార్తలు కాంగ్రెస్‌ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది.

19 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ అసెంబ్లీలోకి ప్రతిపక్షం హోదాతో అడుగుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత పరిస్థితి అయోమయంలో పడిపోయింది. పినపాక, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు తాము టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తామంటూ చేసిన ప్రకటన ఆ పార్టీలో భూకంపం సృష్టించినట్లైంది. ఆనాటి నుంచి మొదలు నేటి వరకు ఒకరి వెనుక మరొకరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రకటనలు హోరెత్తాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఫిరాయింపుల స్పీడ్‌ మరింత పెరిగింది. నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వర్గానికి చెందిన నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్‌ బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తాము టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అవసరం అయితే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌ నుంచి పోటీకి దిగుతామని తమ ప్రకటనల్లో పేర్కొన్నారు.

మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గులాబీ కండువా మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అందులో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం ఇవాళో రేపో కేటీఆర్‌ను కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇలాంటి ప్రచారం జరిగినా ఖండించిన జగ్గారెడ్డి ప్రస్తుతం అలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు కూడా అందుబాటులో లేరు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బుజ్జగింపుల పర్వానికి తెరలేపింది పీసీసీ నాయకత్వం.

ఎమ్మెల్యేల వలసలతో ఏళ్లకు ఏళ్లుగా కాంగ్రెస్‌ జెండాలు పాతుకుపోయిన నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఎమ్మెల్యేలంతా కారెక్కేందుకు క్యూ కడుతుంటే అసలు ఎంతమంది కాంగ్రెస్‌లో ఉంటారనే వాదన తెరపైకి వస్తుంది. నిత్యం కొనసాగుతున్న ఈ ఫిరాయింపులకు ఫుల్‌ స్టాప్‌ ఎప్పుడు పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా విషయంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏఐసీసీ పెద్దలను కూడా కలవరపెడుతోంది. మరి ఈ ఫిరాయింపులు ప్రతిపక్ష హోదా పోయేవరకు కొనసాగుతాయా..? లేక సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడంతో ముగుస్తుందా అన్నది మరికొన్నిరోజుల్లోనే తేటతెల్లం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories