Top
logo

సీఎల్పీ అత్యవసర భేటీ.. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై ఏం నిర్ణయం తీసుకోబోతోందో..?

సీఎల్పీ అత్యవసర భేటీ.. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై  ఏం నిర్ణయం తీసుకోబోతోందో..?
X
Highlights

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయాన ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు కాంగ్రెస్‌...

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయాన ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధమని నిన్నరాత్రి ప్రకటించడంతో ఆపార్టీలో తీవ్ర కలకలం రేగింది. దీంతో ఇవాళ సీఎల్పీ హడావుడిగా సమావేశం అవుతోంది. సమావేశానికి ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారనే అంశం ఆ పార్టీ పెద్దలను కలవరం పెడుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహంపై చర్చించేందుకు రాత్రి టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విందుకు.. మొత్తం ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అందులో ఆత్రం సక్కు, రేగ కాంతారావుతో పాటు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి హాజరుకాలేదు. దీంతో ఆ పార్టీ పెద్దలు వీరిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే వారంతా రకరకాల కారణాలతో హాజరుకాలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు.

మరోవైపు కారెక్కేందుకు కాంగ్రెస్‌, టీడీపీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న సీఎం కేసీఆర్‌తో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర భేటీ కావడంతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్‌ఎస్‌కు జై కొడతారని చెబుతున్నారు. ఇటు ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పోడెం వీరయ్య కూడా కారెక్కుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఎవరెవరు టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకుంటారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా..? అనే చర్చ ప్రతిపక్ష కాంగ్రెస్‌లో జరుగుతోంది. సీఎల్పీ సమావేశం తర్వాత పోటీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story