Top
logo

క్యాబినెట్ విస్త‌ర‌ణ‌పై దృష్టి పెట్టిన గులాబీ బాస్

క్యాబినెట్ విస్త‌ర‌ణ‌పై దృష్టి పెట్టిన గులాబీ బాస్
X
Highlights

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు..? మంత్రి బెర్తులు ఆశిస్తున్న వారిని వేధిస్తున్న ప్రశ్న ఇది. 2014లో యాగం ...

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు..? మంత్రి బెర్తులు ఆశిస్తున్న వారిని వేధిస్తున్న ప్రశ్న ఇది. 2014లో యాగం పూర్తయిన తర్వాత కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అలానే చేస్తారని ఆశావహులు భావిస్తున్నారు. చండీయాగం ముగియడంతో పదవుల పందారం మొదలౌతుందని అంటున్నారు.

ఐదు రోజుల చండీ యాగం పూర్త‌వ్వ‌డంతో ఆమాత్య యోగం క‌ల్పించేందుకు గులాబీ బాస్ క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు. ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో ఓట్ ఆన్ ఎకౌంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని యోచిస్తున్న కేసీఆర్ ఫిబ్ర‌వ‌రి మొద‌టివారంలోనే మంత్రి వ‌ర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేస్తారని అంటున్నారు. ఈసారి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడంతో చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ప్ర‌తి ఉమ్మ‌డి జిల్లాలో 3 నుంచి ఐదుగురు మంత్రి ప‌ద‌వుల‌ కోసం పోటీ ప‌డుతున్నారు. సీనియ‌ారిటీ. సామాజిక వర్గ సమీకరణలు, గత అనుభవం ఆధారంగా మంత్రి పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. కొందరు మాజీలతో పాటు కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లానుంచి మాజీ మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, జోగురామ‌న్న‌‌తో పాటు బాల్క‌ సుమ‌న్, రేఖానాయ‌క్ మంత్రి పదవుల కోసం పోటీ ప‌డుతుండ‌గా బాల్క‌ సుమ‌న్‌కు బెర్త్ ఖాయమని తెలుస్తోంది. రేఖానాయ‌క్‌కు డిప్యూటి స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తారనే ప్రచారం జరగుతోంది. అటు నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డికి స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో బాల్కొండ ఎమ్మెల్యే మిష‌న్ భగీర‌థ వైస్ ఛైర్మన్ వేముల ప్ర‌శాంత్ రెడ్డికి క్యాబినెట్ పోస్ట్ దాదాపు ఖ‌రార‌య్యింది. ఇక క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఈసారి కూడ మంత్రివ‌ర్గంలో చోటు కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. ధ‌ర్మ‌పురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వ‌ర్‌కు ఆమాత్య యోగం ఖాయమైనట్లు స‌మాచారం. 2014లో మంత్రివ‌ర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించిన కొప్పుల ఈశ్వ‌ర్‌కు చీప్ విప్ పదవితో సరిపెట్టిన కేసీఆర్ ఈ సారి మంత్రి ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. మరోవైపు క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ సైతం పోటీలో ఉన్న‌ారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వక ఎలాగూ తప్పదు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కేబినెట్ రేస్‌లో ఉన్నారు. డోర్న‌క‌ర్ ఎమ్మెల్యే రెడ్యా నాయ‌క్ ఎస్టీ కోటాలో బెర్తు దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా తనకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ తనకు తప్పనిసరిగా మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఒకవేళ క్యాబినెట్ భ‌ర్తీలోపు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య టీఆర్ఎస్‌ గూటికి చేరితే ఆయ‌న‌కు సైతం మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మెద‌క్ జిల్లా నుంచి హ‌రీష్ రావుతో పాటు మాజీ డిప్యూటి స్పీక‌ర్ ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డికి క్యాబినెట్‌లో చోటు ద‌క్క‌బోతోంది.

మంత్రి పదవుల కోసం న‌ల్గొండ జిల్లా నుంచి తీవ్ర‌ పోటీ నెల‌కొంది. సూర్య‌ాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఈసారి కూడ బెర్త్ ఖాయ‌మ‌న్న సంకేతాలు ఉన్నాయి. ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ప‌ల్లా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావ‌డంతో ఆయనకు కూడా అమాత్య యోగం వరిస్తుందంటున్నారు. ఇక మ‌హిళా కోటా కింద ఆలేరు ఎమ్మెల్యే గొంగ‌డి సునీత సైతం పోటీలో ఉన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా వ‌న‌ప‌ర్తి నియోజ‌వ‌ర్గం నుంచి గెలుపొందిన ప్లానింగ్ క‌మిష‌న్ వైస్ చైర్మన్ నిరంజ‌న్ రెడ్డికి దాదాపు కేబినెట్ బేర్త్ ఖాయ‌మైన‌ట్లే. మ‌రోవైపు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌కు సైతం ఈసారి అమాత్య యోగం దక్కే అవకాశాలున్నాయి. కొడంగ‌ల్ నుంచి గెలిచిన ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయన సోదరుడు మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి కోరుతున్నారు. అయితే మ‌హేంద‌ర్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు ఇస్తే నరేంద‌ర్ రెడ్డికి ఇత‌ర ప‌ద‌వుల్లో ప్రాతినిద్యం ఇచ్చే అవ‌కాశాలున్నాయి.

ఇక హైద‌రాబాద్ నుంచి ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు క్యాబినెట్ బెర్త్ లు దాదాపు ఖాయ‌మ‌యిన‌ట్లే. ఈ ఇద్ద‌రికి కాపు, యాద‌వ కోటాలో పదవులు దక్కబోతున్నాయి. అయితే మాజీ మంత్రి ప‌ద్మారావుకు మాత్రం ఈసారి అమాత్య యోగం లేదంటున్నారు. అటు రంగారెడ్డి జిల్లా నుంచి సీనియ‌ర్లు లేక‌పోయినా ప్రాతినిద్యం త‌ప్ప‌ని స‌రి కావ‌డంతో మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మ‌ల్లారెడ్డి పోటీ ప‌డుతున్నారు. మ‌రోవైపు మ‌ల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి సీన‌య‌ర్ నేత కావ‌డంతో త‌న‌కు కేసీఆర్ అవకాశం ఇస్తార‌ని న‌మ్మ‌కం పెట్ట‌ుకున్నారు.

అటు పార్ల‌మెంట్ కార్యదర్శుల పదవుల భ‌ర్తీకి సైతం సీఎం కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. 33 జిల్లాల్లో మంత్రి పదవి దక్కని ప్ర‌తి జిల్లా నుంచి కొందరు ఎమ్మెల్యేలను పార్ల‌మెంట్ సెక్రట‌రీల‌ుగా నియమించాలని భావిస్తున్నారు.

Next Story