logo

డైల‌మాలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే.. ఇసారి టికెట్ పై అనుమానం…!!

డైల‌మాలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే.. ఇసారి టికెట్ పై అనుమానం…!!

కాకినాడ సిటీ టీడీపీలో అసమ్మతి సెగ అగ్గి రాజేస్తోంది. ఎమ్మెల్యే అన్నగారి ఆగడాలు తట్టుకోలేకపోతున్నామంటూ. కార్పొరేటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇస్తే పార్టీకి పుట్టగతులు ఉండవంటున్నారు. తామంతా వేరే పార్టీకి జంప్ అయిపోతామంటూ 17 మంది కార్పొరేటర్లు అల్టిమేటం జారీ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా స్మార్ట్ సిటీ కాకినాడ అసెంబ్లీ సీటు విషయంలో కార్పొరేటర్లకు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండబాబుకి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. పేరుకు కొండబాబు ఎమ్మెల్యే అయినా చిన్నపని దగ్గర నుంచి పెద్ద పనుల వరకూ చక్కబెట్టేది మాత్రం ఎమ్మెల్యే అన్నగారు సత్యనారాయణ అంటూ కార్పొరేటర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసే పనులన్నీ అక్రమాల పుట్టని.. లంచాలు తీసుకోవడంలో ఆయన దిట్ట అని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. హౌసింగ్ నుండి అధికారుల ట్రాన్స్ ఫర్ల వరకు లక్షల రూపాయలు అన్నింటిల్లోనూ ఆయనదే పెత్తనమని వాపోతున్నారు.

గత కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజల్లో ఉన్న తమందరికీ సీటు ఇచ్చి కార్పొరేటర్లను చేశారని. ప్రజలు కూడా టీడీపీకి భ్రహ్మరథం పట్టారని కార్పొరేటర్లు అంటున్నారు. కొండబాబు మాత్రం ఏ ఒక్కరోజూ ప్రజలతో మమేకమవలేదని పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొండబాబుకు సీటు ఇస్తే పార్టీకి ఆదరణ ఉన్నా ఈయన పనులు చూసి ఎవరూ ఓటు వెయ్యరని కార్పొరేటర్లు అంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి టికెట్ ఇవ్వొద్దని 17 మంది కార్పొరేటర్లు సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎం చంద్రబాబుకి ఇచ్చారు. ఇప్పటికే మేయర్ తో విభేదాలు. దీనికి తోడు ఎన్నికల దగ్గర కార్పొరేటర్లతో వివాదాలు తోడవడంతో కొండబాబుకి ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక టికెట్ ఇవ్వడానికి మొదట్లో చంద్రబాబు ససేమెరా అనట్లు సమాచారం అందుతోంది. అయితే పలు సర్వేలు, మత్స్యకార సామాజిక వర్గం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కాస్త పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం. మరోవైపు కొండబాబు మాత్రం అసమ్మతి సెగను చల్లార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కార్పొరేటర్లతో మంతనాలు జరిపిస్తునట్లు సమాచారం అందుతోంది. అయితే 17మంది కార్పోరేటర్ల అసమ్మతి సెగ, లేఖాస్త్రం తో చంద్రబాబు కొండబాబు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

లైవ్ టీవి

Share it
Top