తెలంగాణ కాంగ్రెస్‌లో డిన్నర్ల హడావిడి...ఎంపీ టిక్కెట్ల కోసం...

తెలంగాణ కాంగ్రెస్‌లో డిన్నర్ల హడావిడి...ఎంపీ టిక్కెట్ల కోసం...
x
Highlights

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు తెగ డిన్నర్లు చేసుకుంటున్నారంట. ఎందుకో తెలుసా..? మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినందుకు కాదు వచ్చే పార్లమెంటు...

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు తెగ డిన్నర్లు చేసుకుంటున్నారంట. ఎందుకో తెలుసా..? మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినందుకు కాదు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు సంపాదించేందుకు. సీఎల్పీ నేతకు అధిష్టానం వద్ద పలుకుపడి ఉందని ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్యనేతల మెప్పుకోసం వరుసగా డిన్నర్లు ఇచ్చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పార్లమెంటు టిక్కెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోటీపడుతున్నారు. గతంలో అధిష్టానం వద్ద పైరవీలు చేసుకునే ఆనవాయితీ ఉన్న హస్తం నేతలు ఇప్పుడు రాష్ట్ర పార్టీ నేతలను కాకాపడుతున్నారు. నేతల మెప్పు పొందుతే తమకు సీటు ఖాయమన్న ఉద్దేశంతో వరుసగా డిన్నర్లు ప్లాన్ చేస్తున్నారు.

సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మెప్పుకోసం నేతలు తెగ పోటీపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హైకమాండ్ వద్ద పలుకుబడి తగ్గిందని పార్టీలో జోరుగా చర్చజరగడం, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన్ను మార్చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో భట్టివిక్రమార్కకు పార్టీలో డిమాండ్ పెరిగింది. దీంతో ఎంపీ టిక్కెట్టు ఆశిస్తున్న వారంతా భట్టివిక్రమార్క మన్ననలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా డిన్నర్ల బ్యాచ్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారే అధికంగా ఉన్నారు. జడ్చర్లలో పోటీ చేసి ఓడిపోయిన మల్లు రవి ఇప్పుడు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ టిక్కెట్టును ఆశిస్తున్నారు. దీంతో ఆయన తన నివాసంలోనే పార్టీ నేతలందరికీ డిన్నర్ ఇచ్చేశారు. ఇక కరీంనగర్ టిక్కెట్టు ఆశిస్తున్న పొన్నం ప్రభాకర్ కూడా భట్టివిక్రమార్కతోపాటు ముఖ్యనేతలందరికీ డిన్నర్ ఇచ్చి తనకు అవకాశం కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది.

మరోవైపు చేవెళ్ల పార్లమెంటు టిక్కెట్టు ఆశిస్తున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నిజాం క్లబ్‌లో పార్టీ ముఖ్యనేతలకు దావత్ ఇచ్చారు. అలాగే, భువనగిరి ఎంపీ టిక్కెట్టు ఆశిస్తున్న పార్టీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి భట్టివిక్రమార్క కోసం డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇలా పార్టీలో ఎంపీ టిక్కెట్లు ఆశిస్తున్న నేతలంతా భట్టివిక్రమార్క ప్రసన్నం కోసం తహతహలాడుతున్నారు. మరి ఇలా ఎంతమంది భట్టి ఆశీస్సులతో పార్టీ టిక్కెట్లు పొందుతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories