ప్రాంతీయ పార్టీల్లో పొత్తుల అలజడి...మూడో కూటమిపై...

ప్రాంతీయ పార్టీల్లో పొత్తుల అలజడి...మూడో కూటమిపై...
x
Highlights

జాతీయ స్థాయిలో పొత్తుల వ్యవహారం ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కుదిపేస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీయేతర కూటమి కోసం...

జాతీయ స్థాయిలో పొత్తుల వ్యవహారం ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కుదిపేస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీయేతర కూటమి కోసం ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. అందులో భాగంగా నిన్న చెన్నైలో డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ మరుసటి రోజు అదే పార్టీ నేత అమరావతిలో చంద్రబాబుతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరి డీఎంకే స్టాండ్ ఏంటి..? జాతీయ స్థాయిలో ఏదారిన వెళ్లాలనుకుంటోంది.?

జాతీయ స్థాయిలో పొత్తుల వ్యవహారం ప్రాంతీయ పార్టీల్లో అలజడి రేపుతోంది. ఎవరికి వారు పొత్తులపై కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుతో డీఎంకే కోశాధికారి దొరై మురుగన్ సమావేశమయ్యారు. సుమారు 25 నిముషాలపాటు ఇరువురు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్టాలిన్, కేసీఆర్ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు దొరై మురుగన్ వివరించినట్లు తెలుస్తోంది. అయితే, స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అయిన మరుసటి రోజే డీఎంకే నేత దొరై మురగన్ చంద్రబాబును కలవడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది.

అయితే, గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి జాతీయ స్థాయిలో టీడీపీ, డీఎంకే పోరాడుతున్నాయి. పలు అంశాల్లో డీఎంకేకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్‌తో భేటీ ముగిసిన తెల్లారే దొరై మురుగున్‌ను స్టాలిన్ అమరావతికి పంపారు. కేసీఆర్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు వివరించాలంటూ మురుగన్‌కు చెప్పి పంపినట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీలో భవిష్యత్ కార్యాచరణకు తీసుకోవాల్సిన అంశాలపై చంద్రబాబుతో మురుగన్ చర్చించినట్టు సమాచారం.

కేసీఆర్‌తో భేటీకి సంబంధించి డీఎంకే అధినేత స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్ మద్దతు కోరేందుకు కేసీఆర్‌ చెన్నై రాలేదని, కేవలం దైవ దర్శనాల కోసం వచ్చారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ యేతర ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన మరుసటి రోజే స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుంది.

నిజానికి మూడో కూటమిపై స్టాలిన్‌కు మొదటి నుంచి ఆసక్తి లేదు. ఇందుకు కారణం గతంలో థర్డ్ ఫ్రంట్ ప్రయోగం రెండు సార్లు విఫలం కావడమేనన్నది ఆయన అభిప్రాయం. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్న చంద్రబాబుతో సంబంధాలు కొనసాగించాలని స్టాలిన్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దొరై మురుగన్‌కు అమరావతికి పంపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories