18 ఏళ్ల ప్రస్థానం...2001 ఎప్రిల్‌ 27 న పురుడుపోసుకున్న టీఆర్ఎస్‌

18 ఏళ్ల ప్రస్థానం...2001 ఎప్రిల్‌ 27 న పురుడుపోసుకున్న టీఆర్ఎస్‌
x
Highlights

ఆవిర్భవించింది ఉద్యమాన్ని నడిపించింది సబ్బండ వర్గాలను ఏకం చేసింది ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. 18 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర...

ఆవిర్భవించింది ఉద్యమాన్ని నడిపించింది సబ్బండ వర్గాలను ఏకం చేసింది ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. 18 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడో నవ యవ్వన పార్టీ. ఉద్యమ సారధే ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణే లక్ష్యంగా సాగుతున్న టీఆర్ఎస్‌ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

సరిగ్గా 18 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని జ‌లదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఉద్య‌మకారులు, మేథావులతో పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ప్ర‌త్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 14 ఏళ్లు అలుపెరుగెని పోరాటం చేశారు. లెక్క‌లేన‌న్ని వ్యూహాలు రాజీనామాల‌తో ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డేలా ఎత్తులు వేసిన కేసీఆర్‌ తెలంగాణలోని సకల జనులను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో దేశంలోని మిగతా పార్టీల మద్దతు కూడగట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.

ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగారు తెలంగాణే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ఆయన సంక్షేమంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందివ్వడమే ల‌క్ష్యంగా పాలనలో ముందుకు సాగుతున్నారు.

అన్నదాతలకు అండగా రైతు రుణమాఫీతో పాటు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్‌ ఇటు కేంద్రానికి, అటు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. అదే ఊపుతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ఈ సారి 88 స్థానాలను కైవసం చేసుకుని తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. పార్టీ వ్యవహారాలను కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలవడం లక్ష్యంగా పనిచేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుతో దేశంలో గుణాత్మక మార్పును తీసుకొస్తానంటూ ప్రకటించిన కేసీఆర్‌ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం పార్టీ జెండాలను ఎగురవేయడంతోనే ఉత్సవాలను ముగించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories