Top
logo

భానుమతి ఒక్కటే పీస్.. హై బ్రీడ్‌ భామ ఈ బామ్మ

భానుమతి ఒక్కటే పీస్.. హై బ్రీడ్‌ భామ ఈ బామ్మ
X
Highlights

సంకల్పమే ఆయుధమైతే లక్ష్యం బానిస అవుతుంది అన్నది అక్షరాల నిజం అని చెప్తోంది ఓ బామ్మ. ఏడు పదుల వయస్సులో సింగిల్‌ ...

సంకల్పమే ఆయుధమైతే లక్ష్యం బానిస అవుతుంది అన్నది అక్షరాల నిజం అని చెప్తోంది ఓ బామ్మ. ఏడు పదుల వయస్సులో సింగిల్‌ పీస్‌గా పరుగులు పెడుతుంది. కాలినడక కాస్తా చిన్న పరుగుగా మారి పసిడి పంటగా మారింది. మలివయస్సులో ఎంతో ఉల్లాసంగా ఉరకలు పెడుతున్న బామ్మ భానుమతిపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

చకచకా నడుస్తూ చిరుతలా పరుగులు పెడుతున్న ఈ బామ్మ పేరు భానుమతి కాంజీ పటేల్‌. ఈమె వయస్సు 79. మలిదశ వయస్సులో కూడా లేడి పిల్లలా రెట్టించిన ఉత్సాహంతో ఉల్లాసంగా ఉరకలేస్తున్నారు ఈ బామ్మ. బామ్మ భానుమతి వెటరన్‌ ప్లేయర్స్‌ కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న మాస్టర్‌ అథ్లెట్స్‌ 2019లో అండర్‌ 75 విభాగంలో అండర్‌ 5 వేలు, 6వేలు, 7వేల మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచారు. వరసుగా మూడు బంగారు పతకాలను గెలుచుకున్నారు. ఈ విజయాలతో త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు ఈ బామ్మ.

గుజరాత్ రాష్ట్రం, భవ్‌నగర్ జిల్లా వల్బీపూర్‌ పరిధిలోని ఓ రిమోట్ గ్రామంలో నివశిస్తున్నారు బామ్మ భానుమతి. ఈమె కనీసం ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేదు. సాధారణ గృహిణి. 75 ఏళ్లు దాటగానే 4 ఏళ్ల మనవరాళ్లను ప్రతిరోజు నడుచుకుంటూ పాఠశాలకు తీసుకెళ్లి, ఇంటికి తీసుకొచ్చేది. ఇలా రోజు 3 కిలోమీటర్లు నడవాలి. ఆ నడకే బామ్మ భానుమతికి కలిసొచ్చింది. ఇప్పుడు పరుగులు పెట్టిస్తోంది.

బామ్మ చురుకుదనం గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు మండలస్థాయి సీనియర్‌ సిటిజన్స్‌ పరుగు పందెంలో పాల్గొనేలా ప్రోత్సహించారు. అలా పరుగులు పెడుతూ ఇలా నాగార్జున యూనివర్సిటీకి వచ్చారు బామ్మ. శాఖాహార భోజనం తింటూ, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడంతో పాటు, మనసును లక్ష్యం వైపు లగ్నం చేయడమే తన విజయ రహస్యమని చెప్తోంది ఈ బామ్మ భానుమతి. గడిచిన 5ఏళ్లలో 45 పోటీల్లో పాల్గొని, 18 బంగారు, 20 వెండి, 7 కాంస్యపతకాలను గెలుచుకున్నారు ఈ బామ్మ. అందుకే భానుమతి సింగిల్‌ పీస్‌ అయ్యారు.

Next Story