నెల్లిమర్లలో సీన్‌ రివర్స్ అవుతున్నదెవరికి?

నెల్లిమర్లలో సీన్‌ రివర్స్ అవుతున్నదెవరికి?
x
Highlights

విజయనగరం జిల్లాలోని ఆ నియోజకవర్గం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో అసమ్మతి జ్వాలలు చెలరేగుతుంటే, జనసేన, బీజేపీలు ఆ మంటల్లో...

విజయనగరం జిల్లాలోని ఆ నియోజకవర్గం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో అసమ్మతి జ్వాలలు చెలరేగుతుంటే, జనసేన, బీజేపీలు ఆ మంటల్లో చలికాచుకుంటూ, ఎన్నికల్లో కాచుకుందామనుకుంటున్నాయి. ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డగా మత్స్యకారుల సమస్యల ఘోషతో నిర్వాసితుల పోరాటాలతో నిత్యం అట్టుడికిపోయే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరి.

విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గం, 2009 నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కొత్తగా ఏర్పాటైంది. అంతకు ముందు సతివాడ, భోగాపురంగా ఉన్న రెండు నియోజకవర్గాలను రద్దయి నియోజకవర్గంగా ఏర్పాటయ్యింది నెలిమర్ల.

ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలు ఉన్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గానికి తూర్పున చీపురుపల్లి , ఉత్తర పశ్చిమ దిక్కుల్లో విజయనగరం నియోజకవర్గం ఉన్నాయి. ఇంకా దక్షిణ దిక్కులో కొంత భాగం సముద్రం ఉండగా, మరికొంత భాగం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఒక లక్షా 93వేల 212 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 96వేల 507 మంది ఉన్నారు. మరో 96వేల 693 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 12 ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సామాజిక పరంగా చూసుకుంటే తూర్పు కాపు, తెలగ సామాజికవర్గం ఓటర్లు సమానంగా ఉన్నారు. తరువాత స్థానంలో యదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు, క్షత్రియ, ఇతర బీసీ సామాజికవర్గాలకు చెందిన ఓటర్లతొ పాటు దళిత ఓటర్లున్నారు.

1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్బావంతో ఎన్.టి.ఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి, భోగాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసిన, పతివాడ నారాయణ స్వామినాయుడు వరుసగా 1983, 85, 89,94,99, 2014 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు విజయం సాదించారు. పతివాడ నారాయణ స్వామినాయుడు ప్రస్తుత ఎమ్మెల్యే.

నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎక్కవసార్లు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ నియోజకవర్గం ఆపార్టీకి కంచుకోటగా మారింది. కాని ఈసారి పోరు పోటాపోటీగా ఉంది. ఎందుకంటే, టీడీపీలో వర్గ పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఈసారి ఎలాగైనా సిట్టింగ‌ు ఎమ్మెల్యేకు సీటు రాకుండా చూడాలని అన్ని వర్గాలు తెరవెనక ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో ప్రస్తుత ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు సొంత పార్టీ నాయకుల నుంచే గట్టి పోటీని, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

అధికార పార్టీ పరిస్తితి ఇలా ఉంటే ప్రతిపక్ష వైసీపీ నేతలు కూడా తామేమి తక్కువ తినలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈనియోజకవర్గంలోని మరో కురువృద్దుడు మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఆశలకు గండికొడుతూ మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఈసారి తానే ఈ నియోజవర్గం నుంచి పోటీకి సై అంటున్నారు. ప్రస్తుతం బడ్డుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు అలక వహించారని తెలుస్తోంది. సాంబశివరాజు అలక వైసీపీని ఇరుకున పెట్టే అంశమంటున్నారు విశ్లేషకులు.

మొత్తానికి నెలిమర్ల నియోజకవర్గంలో 2019 ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని స్పష్టం అవుతోంది. రెండు ప్రధాన పార్టీల్లోనూ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి, ఈ అసమ్మతిజ్వాల ఎలా చల్లారిపోతుందో, ఎవరు నిలబడతారో, ఎవరు గెలుస్తారో.


Show Full Article
Print Article
Next Story
More Stories