తొమ్మిదేళ్ల పోరాటంలో అన్నదాత విజయం

తొమ్మిదేళ్ల పోరాటంలో అన్నదాత విజయం
x
Highlights

రైతన్న కష్టానికి ఫలితం దక్కింది. తొమ్మిదేళ్ల పోరాటంలో అన్నదాత విజయం సాధించాడు. నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతన్న ఆ కంపెనీ పరిహారం చెల్లించే వరకు...

రైతన్న కష్టానికి ఫలితం దక్కింది. తొమ్మిదేళ్ల పోరాటంలో అన్నదాత విజయం సాధించాడు. నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతన్న ఆ కంపెనీ పరిహారం చెల్లించే వరకు వదిలిపెట్టలేదు. జిల్లా వినియోగదారుల ఫోరం నుంచి జాతీయ కమిషన్ వరకు వెళ్లినా విజయం అన్నదాతనే వరించింది. రైతుకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ జాతీయ కమిషన్ ఆదేశించింది.

సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన రైతు గువ్వల ఎల్లయ్య రెండు ఎకరాల భూమిలో టమాట సాగు చేయాలనుకుంటున్నాడు. 2011 ఆగస్టు 2న ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న విశాల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన విత్తనాలను ఎకరాకు లక్ష రూపాయలతో కొని సాగు చేశాడు. నాసిరకం విత్తనాలతో పంట సరిగా రాలేదు. ఉద్యానవన శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

పంట అమ్ముడు పోకపోవడంతో పంటను ఉద్యానవన శాఖ కార్యాలయం ముందు పారబోసి నిరసన తెలిపాడు. అధికారులు విత్తన తయారీదారులపై కేసు నమోదు చేశారు. పంట వదిలేయాలని విత్తన తయారీదారుల నుంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేశారు.

పరిహారం కోసం రైతు ఎల్లయ్య జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిందని కంపెనీపై దావా వేశాడు. విచారించిన అప్పటి వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ హార్టికల్చర్ అధికారులను పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పంటను పరిశీలించిన అధికారులు విత్తనాలు మారి రైతులకు నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చారు.

నివేదికతో మిగిలిన సాంకేతిక అంశాలను వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద పరిగణించాల్సిన అవసరం లేదని ఫోరం పేర్కొంది. దీనిపై విశాల్ సీడ్స్ రాష్ట్ర ఫోరాన్ని ఆశ్రయించింది. జిల్లా ఫోరం తీర్పును సమర్థిస్తూ ఫిర్యాదు కొట్టివేసింది. తర్వాత విత్తన కంపెనీ జాతీయ వినియోగదారుల కమిషన్ వద్ద పున‌: సమీక్ష పిటిషన్ దాఖలు చేసింది. అక్కడా కంపెనీ పిటిషన్‌ను కొట్టివేసింది. రైతుకు పంట నష్టం కింద 2లక్షల 26వేలు, పరిహారంగా రూ.60వేలు, ఖర్చుల కింద 5వేలు చెల్లించాలంటూ సీడ్ కంపెనీని జాతీయ వినియోగదారుల ఫోరం ఆదేశించింది. నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతు పరిహారం కోసం 9ఏళ్ల పాటు కోర్టుల చుట్టు తిరిగి విజయం సాధించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories