Top
logo

'మా' హీరో ఎవరు?

మా హీరో ఎవరు?
Highlights

మా అసోసియేషన్ ఎన్నికకు అంతా సిద్ధమయ్యింది. ఏకగ్రీవం కాస్తా హోరాహోరీ ఎన్నికలకు దారి తీసింది. ఇద్దరు మిత్రులు...

మా అసోసియేషన్ ఎన్నికకు అంతా సిద్ధమయ్యింది. ఏకగ్రీవం కాస్తా హోరాహోరీ ఎన్నికలకు దారి తీసింది. ఇద్దరు మిత్రులు కాస్తా శత్రువులుగా మారి నువ్వా నేనా అన్నట్టు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రెండు గ్రూపులలో ఎవరికి టాలీవుడ్‌ ఇండస్ట్రీ పెద్దల మద్దతు ఉందో మరి కొద్ది గంటల్లో తేలనుంది.

'మా'పోరు ప‌తాక స్థాయికి చేరింది. 800 ఓటర్లు ఉండే 'మా'లో ఎవరికెన్ని ఓట్లు ప‌డ‌తాయ‌న్న లెక్కలు మొదలయ్యాయి. ఎవ‌రు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అన్న అంచ‌నాలు తారాస్థాయికి చేరుతున్నాయి. నిన్నమొన్నటి వ‌ర‌కూ శివాజీరాజా గెలుపుపై ఎవ్వరికీ అనుమానాలు ఉండేవి కావు. ఎందుకంటే'మా'లో బ‌ల‌మైన శ‌క్తిగా నిలిచిన `మెగా` కాంపౌండ్ అండ శివాజీరాజా వైపే ఉంది. 'ఈసారి నువ్వు నిల‌బ‌డాల్సిందే'అని చిరంజీవి శివాజీరాజాపై ఒత్తిడి తీసుకొచ్చిన‌ట్టు `మా` వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే స‌డ‌న్‌గా నాగ‌బాబు న‌రేష్‌కి మ‌ద్దతు తెల‌ప‌డం చ‌ర్చనీయాంశ‌మైంది.

కొంత కాలం క్రితం టాలీవుడ్‌లో కొన్ని విపరీతమైన ఘటనలు జరిగాయని, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నా మా పట్టించుకోలేదని నాగబాబు అన్నారు. తాను ఆ పరిణామాలకి చాలా బాధపడ్డానని, అందుకే ఈసారి సీనియర్‌ నటుడు నరేష్‌కు అవకాశం ఇద్దామని అనుకుంటున్నట్టు నాగబాబు ప్రకటించాడు. దీంతో మా గేమ్‌ మొత్తం మారిపోయింది. అయితే చిరంజీవిది, నాగబాబుది వేరు వేరు దారులు కావు. అన్నమాటే తమ్ముడి మాట. అలాంటప్పుడు నాగబాబు నరేష్‌ వైపు ఎందుకు మొగ్గు చూపాడు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ఇదిలా ఉంటే నాగబాబుని బాగా బాధపెట్టిన విషయం పవన్‌ కల్యాణ్‌- శ్రీరెడ్డి వివాదం. పవన్‌ను శ్రీరెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడినా మా ప్రతిఘటించలేకపోయింది. ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ ఫిల్మ్‌ చాంబర్‌కి వచ్చి హంగామా సృష్టించారు. మెగా హీరోలతో పాటు, మిగతా వాళ్లు కూడా మీటింగ్‌ పెట్టారు. ఇదంతా మా వైఫల్యం కిందే నాగబాబు లెక్కగట్టాడు. దీంతో శివాజీరాజాను కాదని, నరేష్‌వైపు నాగబాబు మొగ్గుచూపుతున్నాడన్నది ఫిల్మ్‌ నగర్‌ టాక్.‌ అయితే కేవలం నాగబాబు ఒక్కడే నరేష్‌ వైపు ఉన్నాడా? అసలు మెగా ఫ్యామిలీ సపోర్ట్‌ ఎవరికి..? అనే ప్రశ్నలు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి.

Next Story


లైవ్ టీవి