ఓట్ల కోసమే శివసేన బుర్ఖా నిషేధంపై మాట మార్చిందా?

ఓట్ల కోసమే శివసేన బుర్ఖా నిషేధంపై మాట మార్చిందా?
x
Highlights

శ్రీలంక తరహాలో మన దేశంలో కూడా బురఖా నిషేధించాలంటూ శివసేన డిమాండ్ చేసింది. అయితే డిమాండ్ చేసిన కొద్ది సేపటికే ఆ మాటను వెనక్కు తీసుకుంది. ఇంతకీ శివసేన ఈ...

శ్రీలంక తరహాలో మన దేశంలో కూడా బురఖా నిషేధించాలంటూ శివసేన డిమాండ్ చేసింది. అయితే డిమాండ్ చేసిన కొద్ది సేపటికే ఆ మాటను వెనక్కు తీసుకుంది. ఇంతకీ శివసేన ఈ దోబూచులాటలకు కారణమేంటి? దానికి ఎంఐఎం కౌంటర్ ఏంటి?

ఎన్నికల ప్రచారంలో ఓట్ల ఏకీకరణకు పార్టీలు విస్తృతంగా ప్రయత్నిస్తున్నాయి. హిందూ ఓట్లకు గాలం వేసే శివసేన అయిదో దశ పోలింగ్ నేపధ్యంలో హిందూత్వ వాదాన్ని మరోసారి బయటపెట్టింది. శ్రీలంకలో ఉగ్రవాదుల ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి ఆదేశం బురఖాలపై నిషేధం విధించింది. ఆ సంఘటనపై శివసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. రావణ రాజ్యం లంకలో బురఖాలు నిషేధించారు. మరి రాముడి అయోధ్యలో ఈ నిర్ణయం ఎప్పుడు అమలవుతుందని ప్రధాని మోడీని ప్రశ్నించారు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో లంక ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన పొగిడారు ఉగ్రవాదుల కదలికలను గుర్తించడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తీరాలని జాతి భద్రతకు అది అవసరమనీ కామెంట్ చేశారు.

అంతే కాదు ముస్లింలలో మహాత్మా ఫూలే, సాహు మహరాజ్ లాంటి ఉన్నత వ్యక్తులు పుట్టలేదని అందుకే అందులో షాబుద్దీన్ లు, ఆజం ఖాన్, ఒవైసీ బ్రదర్స్ లాంటి వారు ఎక్కువయ్యారనీ సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది. జాతి భద్రతపై ప్రభావం చూపే సంప్రదాయాలకు చరమ గీతం పాడాలని బురఖాలపై నిషేధం విధించాలనీ ఉద్దవ్ థాకరే తన ఎడిటోరియల్ లో కోరారు. ఇది సర్జికల్ స్ట్రైక్ లాంటిదేనని బహిరంగ ప్రదేశాలలో బురఖాలు నిషేధిస్తూ శ్రీలంక ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయం తీసుకుందన్నారు. ముస్లింలు తమ మతాన్ని సరిగా అర్ధం చేసుకోక బురఖాలు ధరించడం, బహు భార్యత్వం, ట్రిపుల్ తలాక్, కుటుంబ నియంత్రణ పాటించకపోవడం చేస్తున్నారని సామ్నా సంపాదకీయం ఘాటైన విశ్లేషణ చేసింది. ఈ ఆచారాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఇస్లాం మతానికి జరిగిన ద్రోహంగా గొడవ చేస్తున్నారని, మతం కన్నా దేశం గొప్పదని వారెప్పుడు గమనిస్తారని సామ్నా ప్రశ్నించింది.

సామ్నా సంపాదకీయంపై ఎంఐఎం మండి పడింది. ఇది హిందూ ఓట్లను ప్రభావితం చేసే లా ఉందని తక్షణం ఈసీ చర్య తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఇది ఈసీ కోడ్ ను ఉల్లంఘించడమేనన్నారు. బురఖాల నిషేధం మన దేశంలో అవసరం లేదంటున్నారు బీజేపీ ప్రతినిధి జీవీఎల్.నరసింహారావు, ఎన్డీఏ మిత్ర పక్షాలు సైతం సేన వ్యాఖ్యలతో విభేదించాయి. తమ వ్యాఖ్యలతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన శివసేన ఆ తర్వాత అది సామ్నా ఎడిటోరియల్ అభిప్రాయమని దాంతో పార్టీకి సంబంధం లేదనీ తేల్చేసింది. ఒవైసీ పిటిషన్ పై ఈసీ ఏం నిర్ణయిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories