Top
logo

తిట్లే విజయానికి మెట్లుగా భావిస్తున్న నేతలు..

తిట్లే విజయానికి మెట్లుగా భావిస్తున్న నేతలు..
Highlights

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపార్టీల ప్రచారం కాక రేపుతోంది. నువ్వొకటంటే నేను రెండు అంటా అన్నట్లుగా దూషణభూషణల...

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపార్టీల ప్రచారం కాక రేపుతోంది. నువ్వొకటంటే నేను రెండు అంటా అన్నట్లుగా దూషణభూషణల పర్వం కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కల్యాణ్ వరకూ తిట్లే విజయానికి మెట్లుగా భావించి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతున్న కొద్దీ వివిధ పార్టీల అధినేతలు, స్టార్ కాంపెయినర్లు మాత్రం తమ ప్రత్యర్థులను విమర్శలు, దూషణభూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నేరుగా తిట్టకపోయినా తిట్టినంత పనిచేస్తున్నారు. పరస్పరవిమర్శలు, తిట్లతో ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రధానపార్టీల నేతలు పోటీపడుతున్నారు. బీజెపీ స్టార్ కాంపెయినర్, ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మక విమర్శలతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మోడీ పాల్గొని తన వాగ్దాటిని ప్రదర్శించారు.

హైదరాబాద్, విశాఖ, నిజామాబాద్, కర్నూలు వేదికలుగా జరిగిన ప్రచార సభల్లో మోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. స్థానిక సమస్యలతో పాటు...ముఖ్యమంత్రులపైన విమర్శలతో దాడి మొదలు పెట్టి వైఫల్యాలను మోడీ ఎండగడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును యూ-టర్న్ బాబు అంటూ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా చేసుకొని బాబు అవినీతికి పాల్పడుతున్నారంటూ మోడీ విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు తెలంగాణా సీఎం కెసీఆర్ జ్యోతిష్యులను సంప్రదించందే ఏమీ చేయలేరని ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోడానికి వారాలకు వారు వేచిచూసారని గుర్తు చేశారు.అయితే తెలంగాణా సీఎం సైతం మోడీ కి తనదైన శైలిలో గట్టిగానే బదులిచ్చారు. హోమాలు, యాగాలు చేసిన తామే అసలైన హిందువులమంటూ మోడీకి బదులిచ్చారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 11సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయని తానే తొలిసారిగా సర్జికల్ స్ట్రయిక్ చేసినట్లుగా మోడీ డంబాచారాలు పలుకుతున్నారంటూ కెసీఆర్ రివర్స్ ఎటాక్ చేశారు.

మరోవైపు ఎపీ సీఎం చంద్రబాబు అటు ప్రధాని మోడీని, ఇటు ప్రతిపక్షనాయకుడు జగన్ ను ఏకగాటన కట్టి మరీ విమర్శిస్తున్నారు. నమ్మించి మోసం చేయటంలో మోడీని మించిన దిట్ట మరొకరు లేరంటూ చంద్రబాదు దుయ్యబడుతున్నారు. వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాలను మోడీ మరచి ఏపీ ప్రజలకు తీరని అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు.అంతేకాదు తనపై 31 కేసులు ఉంచుకొన్న జగన్ కు ఓటేయడం దండుగని, మోడీకి జగన్ తొత్తుగా మారాడని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.అసెంబ్లీకి వచ్చిన సమయం కంటే కోర్టుల చుట్టూ తిరిగిన సమయమే జగన్ కు ఎక్కువని గుర్తు చేశారు.

ప్రతిపక్ష నేత జగన్ సైతం చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని రోజుకో కొత్త విమర్శతో తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు.ఏపీలోని అన్ని వర్గాల ప్రజలనూ చంద్రబాబు మోసం చేశారని ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటీ అమలుచేయలేదని విమర్శిస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుత ఎన్నికల ద్వారానే రాజకీయ అరంగేట్రం చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ సైతం తన ప్రచారాన్ని దూకుడుగా దూషణభూషణలతోనే సాగిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు రిటైర్మెంట్ సమయం వచ్చిందని, ప్రజల ఆకాంక్షలను టీడీపీ నెరవేర్చలేకపోయిందంటూ విమర్శించారు.

అంతేనా తనను యాక్టర్ అంటూ సంబోధించిన జగన్ ను సైతం పవన్ విడిచిపెట్టలేదు. రెండేళ్లపాటు జైల్లో గడిపిన జగన్ పులివెందుల గూండాయిజం చెలాయిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. రాజకీయపార్టీల నేతలు వాడుతున్న తిట్లు,విమర్శలు ఆరోగ్యవంతంగా ఉండాలని వ్యక్తిగతంగా ఉండరాదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏదిఏమైనా విమర్శలలో వాడివేడి, చమత్కారం చూపాలంటే తెలంగాణా సీఎం కెసీఆర్ , ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతే ఎవరైనా. తిట్లే విజయానికి మెట్లుగా భావిస్తున్న నేతలుతిట్లే విజయానికి మెట్లుగా భావిస్తున్న నేతలుతిట్లే విజయానికి మెట్లుగా భావిస్తున్న నేతలు

Next Story