ఎన్నికల బాండ్లలో దాతల పేర్లు చెప్పాల్సిందే.. బాండ్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ఎన్నికల బాండ్లలో దాతల పేర్లు చెప్పాల్సిందే.. బాండ్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
x
Highlights

రాజకీయ పార్టీల నిధుల కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల స్కీంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఎన్నికల బాండ్లలో దాతలు వివరాలను...

రాజకీయ పార్టీల నిధుల కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల స్కీంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఎన్నికల బాండ్లలో దాతలు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేయాల్సిందేనని స్పష్టం చేసింది. దాతల వివరాలను సీల్డ్‌ కవర్‌లోమ అందచేయడానికి సమయం ఇచ్చింది. ఎన్నికల బాండ్ల పిటిషన్‌పై త్వరలోనే సమగ్ర విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రాజకీయ పార్టీల నిధుల కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల స్కీంను యధావిధిగా కొనసాగించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల బాండ్లకు సంబంధించిన దాతలు వివరాలు, వారి బ్యాంకు ఖాతాల సమాచారాన్ని మే 30లోగా సీల్డ్‌ కవర్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని రాజకీయ పార్టీలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సీల్డ్‌ కవర్‌లో సమర్పించే నివేదికలో ఎవరు, ఎంత నిధులిచ్చారనే వివరాలను పొందుపర్చాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై త్వరలోనే సమగ్ర విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికల వ్యయం , రాజకీయ పార్టీల విరాళాల పద్ధతిని ప్రక్షాళన చేసి క్రమబద్దీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లను ఇటీవల తెరపైకి తెచ్చింది. ఏటా నాలుగు నెలలు.. జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరులో ఎలక్టోరల్‌ బాండ్లు అందుబాటులోకి వస్తాయి. వ్యక్తులు లేదా సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బాండ్లను జారీ చేసిన రోజు నుంచి 10 రోజుల వరకు మాత్రమే వీటిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజుల పాటు మాత్రమే ఇవి చెల్లుబాటు అవుతాయి. ఆ లోగా రాజకీయ పార్టీలు తమ ఖాతాలోకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో వచ్చిన విరాళాన్ని జమ చేసుకోవాలి. గత ఎన్నికల్లో 1 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు ఈ బాండ్లను తీసుకునేందుకు వీలుంటుంది.

అయితే ఎలక్టోరల్‌ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ ఏడీఆర్‌ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బాండ్ల జారీపై స్టే విధించాలని, దాతల పేర్లను బయటపెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర తీర్పు ఇచ్చింది. రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్లను జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో 10 రోజుల పాటు క్యాష్ రూపంలో మార్పిడి చేసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే ఏప్రిల్‌-మేకు సంబంధించిన ఎన్నికల బాండ్ల కొనుగోలు సమయాన్ని 10 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించాలని సుప్రీంకోర్టు ఆర్థికశాఖను ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories