భారత ఎన్నికల సరళిలో నయా ట్రెండ్

భారత ఎన్నికల సరళిలో నయా ట్రెండ్
x
Highlights

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు విజయవంతం కావాలంటే ఓటర్లందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని తీరాలి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం...

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు విజయవంతం కావాలంటే ఓటర్లందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని తీరాలి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. రాజకీయ చైతన్యం అధికంగా ఉండే పట్టణప్రాంత ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి తటపటాయిస్తుంటే గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మాత్రం ఎక్కడలేని ఆసక్తి చూపుతున్నారు ఎందుకిలా.

భారత లోక్ సభ తో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం తొలిదశకు తెరపడింది. ఏపీలోని మొత్తం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల పోలింగ్ కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. అయితే భారత ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూస్తే మాత్రం గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. రాజకీయ చైతన్యానికి మరోపేరైన పట్టణప్రాంతాల ఓటర్లు వివిధ కారణాలతో తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి అంతగా ఆసక్తి చూపలేకపోతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల ఓటర్లు మాత్రం వ్యయప్రయాసలకోర్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి ఎనలేని ఆసక్తి చూపుతున్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి 1970 దశకం వరకూ గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ప్రాంతాల ఓటర్లే తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకొంటూ వచ్చారు. ఆ తర్వాత నుంచి పట్టణ ఓటర్ల ఓటింగ్ శాతం తగ్గుతుంటే అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. 1984 నుంచే పెరుగుతూ వచ్చిన గ్రామీణ ఓటర్ల ఓటింగ్ శాతం 1998 నాటికి పట్టణ ఓటర్లను మించిపోయింది. పట్టణప్రాంతాల ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంతాల ఓటర్లే ఆరుశాతం ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతున్నారు.

భారత ఆర్థికవ్యవస్థ పట్టణీకరణ దిశగా సాగిపోతోంది. దీంతో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోతూ వస్తోందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం కేవలం 58 శాతంగా మాత్రమే ఉంది. అయితే 2014 ఎన్నికల నాటికి మాత్రం పట్టణప్రాంతాల పోలింగ్ 62 శాతానికి పెరిగింది.

భారత మొత్తం జనాభాలో 16 శాతం మాత్రమే పట్టణప్రాంత ఓటర్లున్నారు. మొత్తం 543 లోక్ సభ స్థానాలలో 89 పట్టణ ప్రాంతాల నియోజకవర్గాలు ఉండటం విశేషం. పట్టణప్రాంతాలలో వలసకార్మికులే ఎక్కువగా ఉంటున్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. భారత పట్టణాలలో 41 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణప్రాంతాలలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం మరింతగా పాటుపడక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories