నోటాకు పెరుగుతున్న మద్దతు...నోటాకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ ప్రచారం

నోటాకు పెరుగుతున్న మద్దతు...నోటాకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ ప్రచారం
x
Highlights

నోటా ఓటుపై రాను రాను వ్యతిరేకత పెరుగుతోంది. అభ్యర్ధుల గెలుపు, ఓటములకు ఏ మాత్రం సంబంధం లేని ఈ నెగటివ్ ఓటింగ్ వల్ల ప్రజాస్వామ్యానికీ ఓటింగ్ ప్రక్రియకు...

నోటా ఓటుపై రాను రాను వ్యతిరేకత పెరుగుతోంది. అభ్యర్ధుల గెలుపు, ఓటములకు ఏ మాత్రం సంబంధం లేని ఈ నెగటివ్ ఓటింగ్ వల్ల ప్రజాస్వామ్యానికీ ఓటింగ్ ప్రక్రియకు నష్టమేననే భావనలో ఆరెస్సెస్ ఉంది. అందరూ నోటాకే ఓటేస్తే ఈసారి మోడీకి ఎన్నిక కష్టంగా మారుతుందని భయపడుతోంది ఆరెస్సెస్. అందుకే నోటాకు టాటా అంటోంది. ఇంతకీ ఈ నోటా మీట నొక్కితే ఏం జరుగుతోంది?

ఎన్నికల్లో నిలబడిన నేతలు మనకు నచ్చకపోతే నోటాకు ఓటేయడం చూస్తుంటాం దేశ వ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అస్థిరత, పార్టీలు కూటముల మధ్య అభిప్రాయ బేధాలు, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, ఫిరాయింపులు చూసి చూసి విసిగి వేసారిపోయిన ఓటరు నోటా ఆప్షన్ కు బాగా ఆకర్షితుడవు తున్నాడు. స్థిరమైన, నమ్మకమైన ప్రభుత్వం రాదని అనుమానమొస్తే చాలు హంగులతో లేనిపోని తలనొప్పులెందుకు అని నోటాకు తన ఓటు వేసేస్తున్నాడు. కానీ రాను రాను నోటాకు ఓట్ల శాతం పెరుగుతోంది. ఇది చూసి బీజేపీ శ్రేణులు బెంగ పెట్టుకుంటున్నాయి. ఈవీఎంలలో అభ్యర్ధుల జాబితా చివరన ఈ ఆప్షన్ ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో నోటావైపు ఎంతమంది చూస్తారో తెలియనప్పటికీ ఇప్పటికే నిరాశ, నిస్పృహలు, అసంతృప్తిలో కొట్టు మిట్టాడుతున్న నిరుద్యోగ యువత నోటా మీట నొక్కే స్తారేమోనని ఆందోళన పడుతున్నాయి బీజేపీ శ్రేణులు.

సార్వత్రిక ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ నోటా శాతం పెరుగుతూ వస్తోందని ఎన్నికల పరిశీలకులు, సంస్కరణ వాదులూ చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఈసారి నోటాకు ఎక్కువ ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో నిరుద్యోగం అంశం పార్టీలను బాగా దెబ్బ తీస్తుందన్న అంచనాలున్నాయి. అలాగే ఆరోగ్య రంగం, సురక్షితమైన తాగునీరు, రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లాంటి కనీసావసరాలు ఈ సారి ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపే అంశాలని గత నెల 25న రెండు లక్షల 70 వేలమందిపై చేసిన సర్వేలో తేలింది.

ఎక్కువ మంది నోటాకు మద్దతు పలుకుతున్నారన్న వార్తలు మోడీ సమర్ధకులను బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే నోటాకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ ఒక ప్రచారాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుత తరుణంలో నోటాకు మద్దతు పలకడం అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవడమేనని ఆరెస్సెస్ నేతలంటున్నారు. ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొని ఏదో ఓ పార్టీకి ఓటు వేయాలని ఆరెస్సెస్ నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. నోటా ఒక వేస్ట్ ఆప్షన్ సంక్షోభ సమయాల్లో కీలకమైన నేతను తెలివిగా ఎంపిక చేసుకోవాలి తప్ప ఓటును ఇన్ వాలీడ్ చేయకూడదు అంటోంది ఆరెస్సెస్. అభ్యర్ధులందరిపైనా వ్యతిరేకత ఎందుకు? అందరూ నోటాకే ఓటు వేస్తే ఇక ఎన్నికలెందుకు? ఉన్న వాళ్లలో ది బెస్ట్ నేతను ఎన్నుకోండి ఆలోచించి ఓటు వేయండి అని చెబుతోంది ఆరెస్సెస్.

2013లో ఎన్నికల ప్రక్రియలోకి వచ్చిన నోటాకు ఎన్నిక పరంగా ఎలాంటి విలువా లేదు. పోలింగ్ పరంగా ఎలాంటి రిజల్ట్ నూ ఇది చూపించదు. పార్టీలపైనా, నేతలపైనా కక్ష తీర్చుకోడానికి తప్ప నోటా ఎందుకూ ఉపయోగపడదు. 2014 ఎన్నికల్లో నోటాకు1.8 శాతం ఓట్లు వచ్చాయి. ఇక మధ్యప్రదేశ్ లో 23 నియోజక వర్గాలు, రాజస్థాన్లో 16 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన విజేతలకన్నా నోటాకు వచ్చిన ఓట్ల శాతం ఎక్కువగా కనపడింది. అందుకే నోటా కొన్ని నియోజక వర్గాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేసేదిగా ఉంటోందని పార్టీలు భయపడుతున్నాయి. ఒడిషాలో రైతు సంఘాలు నోటాకు ఓటేయమని రైతులను ప్రోత్సహిస్తున్నాయి. అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ ప్రభుత్వం రైతుల డిమాండ్లు నెరవేర్చలేదు. రుణ మాఫీ అమలు చేయకపోగా, కనీస మద్దతు ధరను పెంచలేదు దాంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ ఆగ్రహాన్ని తెలివిగా తమవైపు తిప్పుకుని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ విఫలమైంది. పార్టీలన్నీ తమను మోసగించాయని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. రైతులు, నిరుద్యోగ యువత అన్ని రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వాలపై గుర్రుగా ఉండటంతో ఈ ఎన్నికల్లో ఏం జరగనుందో అన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ ఆగ్రహం ప్రభావం మోడీ పై కచ్చితంగా ఉంటుందని ఆరెస్సెస్ భయపడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories