కర్నూలు సీటు కోసం హోరాహోరీ...సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ రెడ్డికి టెన్షన్ టెన్షన్

కర్నూలు సీటు కోసం హోరాహోరీ...సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ రెడ్డికి టెన్షన్ టెన్షన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ఆశావహుల్లో ఏదో తెలియని ఆందోళన...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ఆశావహుల్లో ఏదో తెలియని ఆందోళన ప్రారంభమయ్యింది. టికెట్ కన్ఫర్మ్ అయిన నేతలు ప్రజల వద్దకు, టికెట్ ఖరారు కానివారు పార్టీల అధినేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. టికెట్ తమకు కేటాయించాలని అధినేతపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు తమ నేతకు మద్దతుగా కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంలో సైతం అదే జరుగుతోంది.

కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేనంత పోటీ కర్నూలు శాసనసభ నియోజవర్గానికి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కి సైతం సీటు టెన్షన్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యే టికెట్ వస్తుందా రాదా అన్న డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. వారి అనుచరగణం వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరే ముందే అధినేత ఇచ్చిన హామీని పదేపదే గుర్తు చేస్తున్నారు.

అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సైతం ఎమ్మెల్యేగా ఎస్వినే ప్రకటించారని మననం చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ నేతకు టికెట్ ఖరారు చేయటానికి లోలోప ఇంత మథనం ఎందుకని, ఇంత ఆలోచన దేనికని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ప్రత్యేకంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఒక వేళ టికెట్ రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఇటు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.

కర్నూలు శాసనసభ స్థానం కోసం టీజీ వెంకటేష్ తనయుడు, టీజీ భరత్ తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు అయితే టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎవరికి సరైన హామీ ఇవ్వకుండా వెయిటింగ్ గేమ్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతలు టికెట్ తమదంటే తమదంటూ ప్రచారం చేసుకుంటూ పైరవీలు మొదలు పెట్టారు.

కర్నూలు టికెట్ కి సంబంధించి తాడోపేడో తేల్చుకునేందుకు అమరావతి కి బయలుదేరి వెళ్లారు కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి. మరోవైపు ఆయన అనుచర గణం కార్యకర్తలతో కర్నూలులో, పత్తికొండలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

టికెట్ కేటాయిస్తే రెండు నియోజకవర్గాలలో గెలుపు కోసం కృషి చేస్తామని ఒకవేళ టికెట్ ఇవ్వని పక్షంలో వ్యతిరేకంగా పని చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనీ, నామినేషన్ కి గడువు కూడా చాలా తక్కువగా ఉందని ఈ నేపథ్యంలో ప్రచారానికి కూడా సమయం సరిపోదని కాబట్టి వీలైనంత త్వరగా తమ నేతకు సీటు ఖరారు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

ఏదిఏమైనా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల తో పోల్చిచూస్తే టిడిపి అధినేతకు కర్నూల్ నియోజకవర్గం కాస్త ఎక్కువ తలనొప్పినే తెచ్చిపెడుతోంది. మరి ఈ సమస్యకు ఏవిధంగా ముగింపు పలికి పరిష్కారం సూచిస్తారో తెలియాలంటే కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories