కేంద్ర మంత్రుల్లో 91% కోటీశ్వరులు

కేంద్ర మంత్రుల్లో 91% కోటీశ్వరులు
x
Highlights

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో దాదాపు అందరూ కోటీశ్వరులే ఉన్నారు. కోట్లకు అధిపతులే కేంద్రమంత్రులయ్యారు. శిరోమణీ అకాళీదల్‌ నాయకురాలు...

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో దాదాపు అందరూ కోటీశ్వరులే ఉన్నారు. కోట్లకు అధిపతులే కేంద్రమంత్రులయ్యారు. శిరోమణీ అకాళీదల్‌ నాయకురాలు కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ 217 కోట్లతో అందరికన్నా ఎక్కువ ఆస్తులతో మొదటిస్థానంలో ఉండగా ఒడిశా మోడీగా పేరుతెచ్చుకున్న అతి సామాన్యుడు ప్రతాప్‌ చంద్ర సారంగి కేవలం 13 లక్షల ఆస్తులతో చిట్ట చివరి స్థానంలో నిల్చారు.

కొత్తగా కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఏకంగా 91 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ సంస్థ విశ్లేషణలో వెల్లడైంది. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన 56 మంది ఎన్నికలకు ముందు ఈసీకి సమర్పించిన ప్రమాణపత్రాలను పరిగణలోకి తీసుకుని ఏడీఆర్‌ ఈ అంశాలను తెలిపింది. కేంద్రమంత్రుల్లో 51 మంది కోటీశ్వరులుగా పేర్కొంది. అందులో 217 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌.. మొదటిస్థానంలో ఉన్నారు. అయితే ఆమెకు అందరికంటే ఎక్కువగా 95 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది.

2014 లోని మంత్రివర్గంలో 92 శాతం మంత్రులు కోటీశ్వరులుండగా తాజా మంత్రివర్గంలో ఒక శాతం తగ్గారు. ఇక రెండో స్థానంలో 95 కోట్లతో రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఉన్నారు. 42 కోట్ల ఆస్తులతో రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌,40 కోట్ల ఆస్తులతో అమిత్ షా వరుసగా ఉన్నారు. ఇటు ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్‌ ఆస్తి 2 కోట్ల 74 లక్షలు కాగా అప్పులు ఒక కోటీ 4 లక్షలుగా చూపించారు. ఇక కేంద్రమంత్రుల్లో అందరి కంటే తక్కువగా అతి సామాన్యుడు ఒడిశా మోడీగా పేరుగాంచిన ప్రతాప్‌ చంద్ర సారంగి ఆస్తుల విలువ కేవలం 13 లక్షలే. ఆస్తుల పరంగా చిట్టచివరన నిలిచిన కేంద్రమంత్రి సారంగే.

మరోవైపు కేంద్రమంత్రుల్లో 39 శాతం మందిపై కేసులున్నట్లు ఏడీఆర్‌ విశ్లేషించింది. 22 మందిపై కేసులున్నాయని.. అందులో అత్యధికంగా ప్రతాప్‌చంద్ర సారంగిపై 7 కేసులున్నట్లు వెల్లడైంది. అలాగే గిరిరాజ్‌ సింగ్‌ పై ఆరు కేసులు అమిత్‌ షా, బాబుల్‌ సుప్రియో, నితిన్‌ గడ్కరీపై నాలుగు కేసులు, అశ్వనీకుమార్‌ చౌబే, నిత్యానందరాయ్‌ మూడు కేసులున్నాయి. వీరందరిపై దాదాపుగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories