హైటెక్ సీటీ రూట్‌లో మెట్రో పరుగులు పెట్టేది ఎప్పుడు..?

హైటెక్ సీటీ రూట్‌లో మెట్రో పరుగులు పెట్టేది ఎప్పుడు..?
x
Highlights

గడువుదాటినా మాదాపూర్ రూట్ లో మెట్రో పరుగుపెట్టలేదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష‌్టతలేదు. ఓ వైపు ట్రయల్ రన్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు, పూర్తికాని పనులు ప్రారంభానికి అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్ కు మెట్రోరైలు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు నగరవాసులు.

గడువుదాటినా మాదాపూర్ రూట్ లో మెట్రో పరుగుపెట్టలేదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష‌్టతలేదు. ఓ వైపు ట్రయల్ రన్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు, పూర్తికాని పనులు ప్రారంభానికి అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్ కు మెట్రోరైలు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు నగరవాసులు. అయితే, ప్రస్తుతం పనులు ఎక్కడికి వచ్చాయి..? ఆలస్యానికి కారణాలేంటి..?

అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ వరకు పరుగులు పెట్టాల్సిన మెట్రో రైలుకు మొదటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందు అలైన్ మెంట్ పెద్ద సమస్యగా మారింది. ఇక పనులు ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. 10 కిలోమీటర్ల మేర మెట్రో మార్గంలో ఉన్న 8 మెట్రోస్టేషన్ల కింద రోడ్డు మార్గంలో చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మార్గంలో మెట్రో స్టేషన్ల వద్ద మెట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్‌ వంటి నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కారిడార్ పై సుమారు 45 రోజులు ట్రయల్ రన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రారంభించిన మెట్రో మార్గాలతో పోలిస్తే, హైటెక్‌ సిటీ మార్గం క్లిష్టమైనదంట‌న్నాయి మెట్రో వ‌ర్గాలు.

సాధారణంగా మెట్రో రైళ్లు ఒక ట్రాక్‌లో వెళ్లి చివ‌రి స్టేష‌న్ వ‌ద్ద మ‌రో ట్రాక్‌లోకి మారి, తిరుగు పయనం అవుతాయి. కాని అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మార్గంలో ఇలాంటి ఎర్పాటు లేదు. చివ‌రి స్టేష‌న్ అయిన హైటెక్ సిటి స్టేష‌న్ వ‌ద్ద రివ‌ర్స‌ల్ వ్య‌వ‌స్థ అందుబాటులోకి రాక‌పోవ‌డంతో వెళ్లిన మార్గంలోనే ట్రైయిన్ వెన‌క్కి రావాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్‌ సమీపంలో రివర్సల్ వ్య‌వ‌స్థ ఉండ‌టంతో సాదార‌ణ ప‌ద్ద‌తుల్లో రైళ్లు ప్రయాణం చేస్తాయి. త‌రువాత ఉండే నాలుగు స్టేషన్లు.. పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గం చెరువు, హైటెక్‌ సిటీ వరకు మాత్రం ట్విన్‌ సింగిల్‌ లైన్‌లోనే మెట్రో ట్రైన్లు వెళతాయి. అంటే వెళ్లిన ట్రాక్ లోనే తిరిగి చెక్‌పోస్టు వరకు వెనక్కి వ‌స్తాయి. నాలుగు స్టేషన్లే కాబట్టి మెట్రో వేళల్లో కొంత జాప్యం ఉండే అవ‌కాశం ఉంది.

ప్రస్తుతం నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 7 నిమిషాలకో మెట్రో నడుస్తోంది. ఇదే మెట్రో హైటెక్‌ సిటీ వరకు వెళుతుంది. ప్లాట్‌ఫాం వ‌న్ వైపు ఉన్న ట్రాక్‌పై నాగోల్‌ నుంచి వచ్చే మొదటి మెట్రో ఎలాంటి ఆటంకం లేకుండా హైటెక్‌ సిటీ చేరుకొంటుంది. దీని వెనుక వచ్చే రెండో మెట్రో రైలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద ట్రాక్‌ మారి, రెండో లైన్ లోకి వెళుతుంది. అయితే ట్రాక్ వ‌న్ లో వెళ్లిన ఫ‌స్ట్ రైల్ అదే ట్రాక్‌పైనే తిరుగుపయనమై.. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద రెండో ట్రాక్‌లోకి మారి నాగోల్‌కు వెళ్తుంది. దీంతో ఈ నాలుగు స్టేషన్ల పరిధిలో ప్రయాణికులు వెళ్లడానికి, రావడానికి ఏ ప్లాట్‌ఫామ్‌నైనా వినియోగించుకోవచ్చు. అయితే ఇలాంటి చ‌ర్య‌ల ద్వారా సాదార‌ణ స‌మ‌యం కన్నా కొన్నినిముషాల సమయం ఎక్కువ తీసుకుంటుందని అధికారులు చెప్తున్నారు.

ఏదేమైనా హైటెక్ సిటీకి మెట్రో ఎప్పుడు ఎఫ్పుడు వస్తుందా అని నగరవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. అయితే, కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ త్వరలోనే వస్తుందని ఇక మిగిలిన చిన్న చిన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఫిబ్రవరి రెండో వారం కల్లా ఈ మార్గంలో మెట్రోపరుగులు పెడ్తుందని అధికారులు అంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories