logo

కర్ణాటకలో మళ్లీ వేడెక్కిన రాజకీయాలు

కర్ణాటకలో మళ్లీ వేడెక్కిన రాజకీయాలు

కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య విబేధాలు మొదలయ్యాయా..? రెండు పార్టీలకు ఒకరంటే ఒకరు పడటం లేదా... సీఎం కుమారస్వామి కాంగ్రెస్‌తో విసిగెత్తిపోయారా..? కుమార స్వామి మాటలు వింటుంటే అటువంటి సందేహాలే కలుగుతున్నాయి.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు ముదురుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో తాజా పరిణామాలు కుమారస్వామిని విసిగెత్తిపోయేలా తయారయ్యాయని చెప్పేందుకు ఆయన మాటలే నిదర్శనంగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్టానం కనుక నియంత్రించకుంటే తాను ముఖ్యమంత్రిగా దిగిపోయేందుకు సిద్ధమనే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ నేతలు పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు కుమారస్వామి.

కుమారస్వామి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత పుట్టరంగ శెట్టి తన దృష్టిలో కుమారస్వామి సీఎం కాదని సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అనే వ్యాఖ్యలు చేయడంతో కుమారస్వామి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడు నెలల పూర్తయినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటున పడ్డాయని సిద్ధరామయ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. అంతేకాదు సిద్ధరామయ్యకు మరో ఐదేళ్లు అధికారం ఇచ్చి ఉంటే రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోయి ఉండేదని మరో సిద్ధరామయ్య వర్గీయుడు ఎమ్మెల్యే సోమశేఖర్ వ్యాఖ్యానించారు.

ఈ వివాదంపై కాంగ్రెస్‌ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం జి పరమేశ్వర స్పందించారు. సిద్దరామయ్య గొప్ప సీఎం అని ఆయన మా సీఎల్పీ నేత అని గుర్తుచేశారు. సిద్దరామయ్య సీఎం అయితే బాగుండని ఓ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో తప్పేముందని అభిప్రాయపడ్డారు.

కుమారస్వామితో తమకెలాంటి ఇబ్బంది లేదని, మీడియానే అతిగా ప్రవర్తిస్తుందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు.

కర్నాటక సంకీర్ణ ప్రభుత్వంలో బేధాభిప్రాయాలు రావడంతో మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవెగౌడ స్పందించారు. సంకీర్ణ ప్రభుత్వం అన్నాక బేధాభిప్రాయాలు రావడం సహజమే అన్నారు. అంతమాత్రాన ప్రభుత్వం పడిపోదని తెలిపారు. ఈ విషయాన్ని పెద్దగా చూడాల్సిన పనిలేదన్నారు దేవెగౌడ. కూర్చుని సమస్యను చర్చించి పరిష్కారం కనుగొంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇంతకంటే తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు దేవెగౌడ.

లైవ్ టీవి

Share it
Top