మోదీని నిగ్గదీయండి

మోదీని నిగ్గదీయండి
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కేడర్‌ను అధినేత రాహుల్ గాంధీ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా పరిస్ధితులను అంచనా వేస్తున్న...

సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కేడర్‌ను అధినేత రాహుల్ గాంధీ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా పరిస్ధితులను అంచనా వేస్తున్న ఆయన కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల్లో సాగించాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తరహాలోనే విజయాలను సొంతం చేసుకోవాలని రాహుల్ వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపే అభ్యర్ధులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రణాళికలు రచిస్తున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని దీన్ని ఓటు రూపంలో మార్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ పోరుబాట పట్టాలంటూ నేతలకు రాహుల్‌ సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుగుణంగా ప్రచార వ్యూహాలు, కార్యక్రమాలతో ముందుకు సాగాలని పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల జాబితాలను రాష్ట్రస్థాయిలో పీసీసీల్లో చర్చించి ఏఐసీసీకి సమర్పించాలని రాహుల్ ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇచ్చిన అధిష్టానం ఆయా చోట్ల సీనియర్ నేతలతో సంప్రదించి సూచనలు పంపాలని కోరింది.

రాఫెల్ డీల్‌, ఇంధన ధరల పెంపు, పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులు, జీఎస్టీతో వచ్చిన సమస్యలు, నిరుద్యోగంపై యువతలోని అసహన అంశాలను ప్రచారాస్త్రాలుగా మలచుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రైతులు, నిరుద్యోగులు, రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణ, నిత్యావసర వస్తువులు వంటి అంశాలతో మ్యానిఫెస్టో రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన ప్రధాన అంశాలను వీలైనంత త్వరగా పీసీసీ స్థాయిలో చర్చించి ఏఐసీసీ మ్యానిఫెస్టో కమిటీకి సమర్పించాలని ఆదేశించారు.

సమావేశం చివర్లో పీసీసీ అధ్యక్షులు ఒక్కొక్కరితో రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణాలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని పునరావృతంకాకుండా పార్టీ శ్రేణులను లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టికి సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిటీల ఏర్పాటు పూర్తయినందున ప్రజల్లోకి దూసుకెళ్ళేలా ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని రాహుల్ ఆదేశించారు. ఏపీ పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించిన రాహుల్ రాష్ట్రంలో ఈనెల 3వవారంలో చేపట్టనున్న ప్రత్యేకహోదా భరోసా యాత్రకు ఏర్పాట్లు చేయాలంటూ సూచించారు.

వీలైనంత త్వరగా అభ్యర్ధులను ఎంపిక చేయడం ద్వారా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్ధాన్‌‌ల తరహాలో విజయాలు సొంతం చేసుకోవాలని రాహుల్ భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక మేనిఫేస్టోల ద్వారా ప్రజలను ఆకట్టుకునేందుకు రాహుల్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories