ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ ప్రవేశం

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ ప్రవేశం
x
Highlights

సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగించింది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకంతో హిందీ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టార్‌ క్యాంపెయిన్‌ర్‌గా ఆమె సేవలను వాడుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది.

మాజీ ప్రధాని ఇందిరగాంధీ మనుమరాలు, రాజీవ్-సోనియాల తనయ ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమెకు తూర్పు ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ ఆమె సోదరుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ స్టార్ క్యాంపైనర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు నేరుగా సవాల్ విసిరేందుకే ప్రియాంకను ఇక్కడ రంగంలోకి దించినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రియాంక తన తల్లి, సోదరుడి సొంత నియోజకవర్గాలైన రాయ్‌బరేలి, అమేథి ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఆమె పాల్గొన్నారు. అఖిలేశ్‌- మాయావతి పొత్తు నేపథ్యంలో యూపీలో ఎలాగైనా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర ప్రదేశ్ తూర్పు ఇన్చార్జిగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపడతారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ నియమించారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇక జ్యోతిరాదిత్య సింధియాకు పశ్చిమ యూపీ బాద్యతలు అప్పగించారు. గులాం నబీ ఆజాద్‌ను యూపీ ఇన్‌ఛార్జ్‌గా తప్పించి ఆయనకు హర్యానా బాధ్యతలు కట్టబెట్టారు. కేసీ వేణుగోపాల్‌ను ఏఐసీసీ సంస్ధాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియాను నియమించారు. ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ఇన్చార్జి బాధ్యతలను జ్యోతిరాదిత్య సింధియా తక్షణమే చేపడతారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు రాహుల్‌.. ఓ మంచి స్ట్రాట‌జీ అమ‌లు చేశార‌ని కొంద‌రు పార్టీ సీనియ‌ర్లు అంటున్నారు.

ప్రియాంకా గాంధీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ‌డంతో ఏ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త‌ల్లి సోనియా గాంధీ నియోజ‌క‌వర్గ‌మైన రాయ్‌బ‌రేలీ నుంచి కూతురు ప్రియాంకా పోటీకి దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి 2017లో జ‌రిగిన యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రియాంకా సీఎం అభ్య‌ర్థిగా పోటీ ప‌డే ఛాన్సు ఉంద‌ని అప్ప‌ట్లో ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రియాంకా త‌న‌కు రాజ‌కీయాల మీద ఇష్టం లేద‌ని చెప్పారు. అయితే చాన్నాళ్ల త‌ర్వాత రాజ‌కీయాల‌పై ఆమె మ‌క్కువ చూపిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు యూపీ ఈస్ట్ బాధ్య‌తలు ప్రియాంకాకు అప్ప‌గించారు.

యూపీ ఈస్ట్‌లో కీల‌క‌మైన గోర‌ఖ్‌పూర్‌, వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. గ‌త పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో గోర‌ఖ్‌పూర్ నుంచి యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌, వార‌ణాసి నుంచి ప్ర‌ధాని మోదీ ఎంపీగా ఎన్నిక‌య్యారు. అయితే ఆదిత్య‌నాథ్ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఆ స్థానాన్ని కోల్పోయింది. చాలా రిస్కీ బాధ్య‌త‌ల‌నే ప్రియాంకాకు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. గోర‌ఖ్‌పూర్‌, వార‌ణాసీ సీట్ల‌ను టార్గెట్ చేయ‌డం అంటే.. ప్రియాంకాతో కాంగ్రెస్ పెద్ద స‌వాల్ విసిరిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. యూపీలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు.. ప్రియాంకతో ద‌గ్గ‌ర సంబంధాలు ఉన్నాయి. రాహుల్ క‌న్నా ఎక్కువ‌గా స్థానిక కార్య‌క‌ర్త‌లు ప్రియాంకాతో అతి స‌న్నితంగా ఉంటార‌ని కొంద‌రంటున్నారు.

గత ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడంలోనూ, అభ్యర్థుల జాబితా తయారుచేయడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెకు ఓ పదవిని కేటాయించడం ద్వారా పార్టీ వ్యవహారాల్లో చురుకైన ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు అవకాశం కల్పించినట్టైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories