పేలుడు జరిగిన చర్చిలో ప్రారంభమైన ప్రార్థనలు

పేలుడు జరిగిన చర్చిలో ప్రారంభమైన ప్రార్థనలు
x
Highlights

శ్రీలంకలో వరుస బాంబు దాడులతో ప్రజల ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులు దాడి చేసిన చర్చి తిరిగి ప్రార్థనలకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 21న దాడుల తరువాత మూత పడిన ఈ...

శ్రీలంకలో వరుస బాంబు దాడులతో ప్రజల ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులు దాడి చేసిన చర్చి తిరిగి ప్రార్థనలకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 21న దాడుల తరువాత మూత పడిన ఈ చర్చిని ఆదివారం తిరిగి ప్రజల కోసం తెరిచారు. దీంతో సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో బాంబుదాడుల తర్వాత తొలిసారిగా ఆదివారం క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ సందర్బంగా ఈ చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి బాంబర్లు జరిపిన దాడిలో దాదాపు 250 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ చర్చి మూతపడి ఉంది. నేడు ఆదివారం ప్రార్థనలకు అనుమతించే ముందు ఆర్మీ సిబ్బంది చర్చి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే క్రైస్తవులను లోపలికి అనుమతించారు. తొలిసారిగా ప్రార్థనలు మొదలవుతున్న నేపథ్యంలో చర్చి పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సాయుధ జవాన్లు గేటు ఎదుట నిలబడి వచ్చిన వారిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ప్రార్థనలకు వచ్చే వారు కచ్చితంగా గుర్తింపు కార్డు తీసుకురావాలనే నిబంధన పెట్టారు. స్థానికులను గుర్తుపట్టే విధంగా గేటు ఎదుట కొద్ది మంది వాలంటీర్లను నియమించారు. చర్చి పరిసరాల్లో పార్కింగ్‌ను నిషేధించారు. వీలైనంత వరకు తక్కువ లగేజీతోనే రావాలని భక్తులకు సూచించారు.

ఏప్రిల్‌ 21 ఆత్మహుతి దాడి జరిగిన తర్వాత కొలంబోలోని అన్ని ప్రార్థనా మందిరాల్లో సేవలను నిలిపివేశారు. అయితే క్రైస్తవ మత గురువు కార్డినల్‌ మాల్కోమ్‌ రంజిత్‌ సూచన ప్రకారం ఈ రోజు నుంచి ప్రార్థనలు పునఃప్రారంభించారు.పవిత్ర ఈస్టర్‌ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈస్టర్‌ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చిలు, హోటళ్లే లక్ష్యంగా ముష్కర మూకలు రెచ్చిపోయి మారణహోమం సృష్టించాయి. మూడు చర్చిలు, పలు హోటళ్లు సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో దాడులకు దిగారు. ఈ దాడులతో శ్రీలంకలో భయానక వాతావరణం ఏర్పడింది. ఎనిమిదో పేలుడులో ముగ్గురు పోలీసులు మృత్యువాతపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories