logo

ప్రణబ్, నానాజీ, భూపేన్‌లకు భారతరత్న

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. ఆర్ఎస్ఎస్ నేత, సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్‌‌తో పాటు అస్సామీ జానపద గాయకుడు భూపేన్‌ హజేరికాలకు మరణానంతరం ఈ అత్యున్నత పురస్కారానికి కేంద్రం ఎంపికచేసింది.

ప్రణబ్, నానాజీ, భూపేన్‌లకు భారతరత్న

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. ఆర్ఎస్ఎస్ నేత, సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్‌‌తో పాటు అస్సామీ జానపద గాయకుడు భూపేన్‌ హజేరికాలకు మరణానంతరం ఈ అత్యున్నత పురస్కారానికి కేంద్రం ఎంపికచేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను ప్రకటించారు

ఈసారి ముగ్గురు దిగ్గజాలకు భారత రత్న పురస్కారం ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తోపాటు సోషల్ యాక్టివిస్ట్ నానాజీ దేశ్‌ముఖ్, మ్యూజిక్ మాస్ట్రో డాక్టర్ భూపేన్ హజారికాను భారత రత్నతో స‌త్క‌రించిన‌ట్టు రాష్ట్రపతి భవన్ కార్యాలయం ప్రకటించింది. నానాజీ, భూపేన్‌లకు మరణానంతరం భారత రత్న పురస్కారం ఇచ్చారు.

రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరున్న ప్రణబ్ పలు అత్యున్నత పదవులు నిర్వహించారు. రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిగా సేవలందించిన ప్రణబ్ ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో పనిచేశారు. 2012 నుంచి 2017 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు. 1935 డిసెంబర్‌ 11న బెంగాల్‌లోని మిరాఠీలో జన్మించిన ఆయన దాదాపు 50 ఏళ్లు దేశ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ప్రణబ్ దేశ రాజకీయాల్లో అత్యున్నత ప్రమాణాలను అనుసరించారన్న పేరుంది. అనేక సంక్షోభాల సమయాల్లో పరిష్కారాలను చూపిన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రణబ్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2008లో ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం అందించింది. తాజాగా దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.

నానాజీ దేశ్‌ముఖ్‌గా అందరికీ సుపరిచితమైన చండికా దాస్‌ అమృత్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ సామాజిక కార్యకర్తగా దేశానికి ఎనలేని సేవలందించారు. మహారాష్ట్ర హింగోలీలో 1916లో పుట్టిన ఆయన బిట్స్‌ పిలానీలో చదివారు. విద్య, వైద్యం, గ్రామీణంలో విశేష సేవలందించిన నానాజీ 2010 ఫిబ్రవరిలో సత్నాలో తుది శ్వాస విడిచారు. ఈయన ఆరెస్సెస్ నేత. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. సమాజానికి నానాజీ చేసిన సేవలను గుర్తించి 1999లో పద్మవిభూషణ్‌ పురస్కారంతో కేంద్రం సత్కరించింది. ఇప్పుడు భారతరత్న పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది.

సంగీత విద్వాంసుడిగా, దర్శక నిర్మాతగా కవిగా, గాయకుడిగా సేవలందించిన భూపేన్ హజారికాను అసోం వాసులు సుధాకాంతగా పిలుచుకుంటారు. 1926 సెప్టెంబర్ 8వ తేదీన అస్సాంలోని సాదియాలో జన్మించిన భూపేన్ హజారికా హిందీ, బెంగాలీ, అస్సామీ సినిమాలకు పని చేశారు. బ్రహ్మపుత్ర అలల ఘోష, అమ్మలాలిపాట వింటూ పెరిగి పెద్ద సంగీత విద్వాంసుడిగా ఎదిగిన ఆయన 2011లో తుదిశ్వాస విడిచారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన హజారికా సినీరంగానికి చేసిన సేవలను గుర్తించి 1992లో దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం ఇచ్చారు. భిన్నరంగాలకు చేసిన సేవలను గుర్తించి ఆయన మరణానంతరం 2011లో పద్మవిభూషన్‌ పురస్కారంతో కేంద్రం సత్కరించుకుంది. సంగీత నాటక అకాడమీ రత్న అవార్డు, అస్సాం రత్న అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. ఇప్పుడు దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

భారతరత్న పురస్కారం అందుకోబోతున్న ప్రణబ్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్ నిస్వార్థంగా, విరామం లేకుండా.. దశాబ్దాల పాటు దేశానికి సేవ చేశారని ప్రదాని మోడీతో పాటు పలువురు కొనియాడారు.

లైవ్ టీవి

Share it
Top