logo

మిగిలింది వారమే...వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న...

మిగిలింది వారమే...వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న...

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలంతా పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంకా ప్రచారానికి సరిగ్గా వారం రోజులే గడువు ఉండటంతో అగ్రనేతలంతా కధనరంగంలోకి దిగిపోతున్నారు. గెలుపు కోసం ఎవరికి వారే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లెలో, 1.45 గంటలకు చంద్రగిరిలో, 3 గంటలకు నగరిలో తమ పార్టీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 4.45 గంటలకు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో, 6.15 గంటలకు వేదాయపాలెంలో రోడ్ షోలో ప్రసంగించనున్నారు చంద్రబాబు.

మరోవైపు వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఎంతగానో శ్రమిస్తున్నారు. తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు మూడు జిల్లాల్లో ఆయన పర్యటనలు కూడా చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారానికి నేడు విరామం ప్రకటించారాయన. ఎన్నికల వ్యూహంపై ఇవాళ ఆయన పార్టీ నాయకులతో సమావేశమై చర్చించనున్నారు. అలాగే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు.

అలాగే, వైసీపీ నేతలు విజయమ్మ, షర్మిలా కూడా ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ విజయమ్మ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనుండగా షర్మిల కృష్ణాజిల్లాలోని గన్నవరం, నూజివీడు ప్రచారం చేపట్టనున్నారు.

ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి నేడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ఆమె భేటీ కానున్నారు. పర్యటనలో భాగంగా ఆమె రెండు రోజుల పాటు విశాఖ జిల్లాలో జనసేనకు మద్దతుగా పవన్‌తో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ టూర్ తర్వాత తెలంగాణలో బీఎస్పీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ ఆయన వరంగల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. వరంగల్‌లోని అజంజాహి మిల్లు మైదానంలో, భువనగిరి పట్టణంలోని నీలగిరి టాకీస్ పక్కన మైదానంలో నిర్వహించే భారీ బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. అలాగే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగర శివారులోని దమ్మాయిగూడలో రోడ్‌షో నిర్వహించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు కూడా తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నిన్న హైదరాబాద్‌‌ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరుకాగా, ఇవాళ కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. మరోవైపు విశాఖలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, గుంటూరు జిల్లా నరసరావుపేటలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

లైవ్ టీవి

Share it
Top