రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన చంద్రగిరి రీపోలింగ్

రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన చంద్రగిరి రీపోలింగ్
x
Highlights

చంద్రగిరి నియోజవర్గంలో రీపోలింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కొద్దిగంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్నా టీడీపీ, వైసీపీ...

చంద్రగిరి నియోజవర్గంలో రీపోలింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కొద్దిగంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్నా టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధం మాత్రం ఆగలేదు. ఓ వైపు ఈసీ తీరుపై టీడీపీ జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుండగా వైసీపీ నేతలు కూడా ఢిల్లీ బాటపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కౌంటింగ్‌ రోజున కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టు చేయాలని ఈసీని కోరారు.

సార్వత్రిక ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరింది. దేశవ్యాప్తంగా తుది దశ పోలింగ్ ఆదివారంతో ముగియనుంది. సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్‌ కూడా వెలువడనున్న తరుణంలో ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో 7 చోట్ల రీపోలింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఏపీలో మొదటి దశలోనే పోలింగ్ పూర్తయినప్పటికీ టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదులతో రీపోలింగ్‌‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ముందు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల రీపోలింగ్ నిర్వహించిన ఈసీ తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 7 కేంద్రాల్లో ఆదివారం రీపోలింగ్ నిర్వహిస్తోంది.

ఎన్నికల సంఘం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఎన్నికలు ముగిసిన నెలరోజుల తర్వాత రీ పోలింగ్‌కు ఆదేశించడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఢిల్లీలో ఈసీని కలిసి నిరసన వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ నేతలు ఈసీని కలిసి చిత్తూరు కలెక్టర్‌ ప్రద్యుమ్నపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మరికొద్ది గంటల్లో చంద్రగిరి నియోజకవర్గంలోని వివాదాస్పద కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభం కానుంది. 23న కౌంటింగ్‌ కూడా జరగనున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories