Top
logo

పులివెందుల్లో బాబు...కుప్పంలో జగన్...

పులివెందుల్లో బాబు...కుప్పంలో జగన్...
Highlights

ఇద్దరూ ప్రధాన పార్టీల అధినేతలు. ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ముఖ్యమంత్రి అభ్యర్థి. రాష్ట్రమంతా తిరుగుతూ,...

ఇద్దరూ ప్రధాన పార్టీల అధినేతలు. ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ముఖ్యమంత్రి అభ్యర్థి. రాష్ట్రమంతా తిరుగుతూ, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ఇద్దరూ ఏకంగా ప్రత్యర్థి కోటపైనే గురిపెట్టారు. మొన్న చంద్రబాబు పులివెందుల సభతో చెలరేగిపోతే, ఇప్పుడు కుప్పం స్థావరంపైనే గురిపెట్టారు జగన్. చరిత్రను తిరగరాసి, సంచలన విజయం కట్టబెట్టాలని ప్రజలకు విజ్తప్తి చేశారు. అసలు ప్రత్యర్తుల కోటలపై ఇద్దరు అధినేతల వ్యూహమేంటి?

రాజుల కాలంలో రాజ్యాలుండేవి. సంస్థానాలుండేవి. వారికే సొంతమైన కోటలివి. మరెవరూ టచ్‌ చేయలేని స్థావరాలివి. దేశంలో కొంతమంది రాజకీయ నాయకులకు కూడా కొన్ని నియోజకవర్గాలున్నాయి. దశాబ్దాలుగా చెక్కుచెదరని కోటల్లా వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. పులివెందుల వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటయితే, కుప్పం నారా చంద్రబాబు ఫ్యామిలీకి పెట్టని కోట.

పులివెందుల పేరు చెబితే దేశంలో ఎవరికైనా గుర్తొచ్చేది వైఎస్. కుప్పం పేరు పలకగానే గుర్తొచ్చే ఏకైక పేరు చంద్రబాబు. ఎన్నికల టైంలో ఈ రెండు కోటలపై ఇద్దరూ ప్రత్యర్థులు గురిపెట్టారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న లక్ష్యంతో ఫోకస్ పెట్టారు.

మూడు, నాలుగు రోజుల క్రితం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల గడ్డపై కాలుమోపారు సీఎం చంద్రబాబు. అక్కడ భారీ రోడ్ షో నిర్వహించారు. జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జనాల ఉత్సాహాన్ని చూస్తుంటే, పులివెందులలో తెలుగుదేశం ప్రభంజనం ఖాయమంటూ చంద్రబాబు ప్రసంగం చేశారు.

పులివెందులకు వైఎస్‌ ఫ్యామిలీ చేసిందేమీ లేదంటూ ప్రసంగం చేశారు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వమే పులివెందుల అభివృద్దికి ఎంతో కృషి చేసిందన్నారు. పిలిస్తే పలికే తెలుగుదేశం అభ్యర్థి వెంకట సతీష్‌ రెడ్డిని గెలిపించాలని జనానికి పిలుపునిచ్చారు చంద్రబాబు.

అటు వైఎస్‌ జగన్‌ కూడా, నారా వారి కోటలో అడుగుపెట్టారు. కుప్పంలో రోడ్‌ షో నిర్వహించారు. హలో కుప్పం అంటూ అభివాదం చేస్తూ, కుప్పం ప్రజలను పలకరించారు. 30 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు, ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఇందులో 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పం ప్రజల సమస్యలు పట్టించుకోలదేని మండిపడ్డారు జగన్. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో, కుప్పం ఎంతోకొంత అభివృద్ది చెందిందని చెప్పారు.

అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసినట్టే, ఈ నియోజకవర్గాలకూ పార్టీల అధినేతలు ప్రచారం చేశారని చెప్పలేం. ఇంత భారీ ఎత్తున రోడ్‌ షోలు నిర్వహించడం వెనక, నాయకులకు పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది. తన ప్రత్యర్థిని సొంత నియోజకవర్గంలోనే ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది వారి స్ట్రాటజీ. దాని ద్వారా ఇతర నియోజకవర్గాలపై దృష్టిపెట్టలేనంతగా అలజడి రేపాలన్నది ఆలోచన. అందుకే అటు పులివెందులలో బాబు రోడ్‌ షో, ఇటు కుప్పంలో జగన్‌ రోడ్‌ షోలకు జనాన్ని భారీగా సమీకరించారు. పెద్ద నాయకులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించి, భారీ ఎత్తున నేతలను మోహరింపజేసి, రోడ్‌ షోలను సక్సెస్ చేశారు. ప్రసంగాల మధ్యలో జనంతోనే అనేక మాటలు పలికించే ప్రయత్నం చేశారు అధినేతలు.

జగన్‌ నియోజకవర్గంలోనే జేజేలు పలికించుకున్నామని తెలుగుదేశం అంటే, చంద్రబాబు సెగ్మెంట్‌లో ప్రజలతో శభాష్‌ అనిపించుకున్నామని వైసీపీ సంబరపడుతోంది. సొంత నియోజకవర్గంలో ఇంత వ్యతిరేకత ఉందని, ఇక మొత్తం రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని, స్టేట్‌ మొత్తం ప్రచారం చేయడమే రెండు పార్టీల అధినేతల స్ట్రాటజీగా అర్థమవుతోంది. అందుకే అటు పులివెందులలో చంద్రబాబు ప్రచారాన్ని హోరెత్తిస్తే, ఇటు కుప్పంలో జగన్‌ భారీ రోడ్‌ షో నిర్వహించి అదే సమర సంకేతం పంపారు. ప్రత్యర్థుల కోటలో పాగా వేసి, ఎంతోకొంత అలజడి రేపడమే ఇద్దరి లక్ష్యం కూడా. ఇరువురికీ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో, పరస్పరం ప్రచారం చేశారు. మరి ఆ ప్రభావం ఎన్నికల్లోనూ కనబడుతుందా రోడ్ షోలో కనిపించిన స్పందన ఓట్ల రూపంలో వెల్లువెత్తుతుందా అన్నది, మాత్రం చెప్పలేం. గతంలోనూ ఇలాగే జనాల నుంచి స్పందన వచ్చింది కానీ, చంద్రబాబు, జగన్‌లు ఓడింది లేదు. ఇద్దరూ ముఖ్యమంత్రి అభ్యర్థులు కావడంతో, అంత ఈజీగా జనం ఓడించే ఛాన్స్ లేదన్నది విశ్లేషకుల మాట. ఓడించకపోయినా, మెజారిటీ తగ్గించి నైతిక విజయం సాధిస్తామని రెండు పార్టీలు బల్లగుద్ది చెబుతున్నాయి. మరి ఓటరన్న మదిలో ఏముందో ఫలితాల రోజే తెలుస్తుంది.

Next Story