యువతిని ఎరవేసిన మాట నిజమే: శిఖా చౌదరి

యువతిని ఎరవేసిన మాట నిజమే: శిఖా చౌదరి
x
Highlights

వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. హత్యకు సూత్రధారులు ఆయన మేనకోడలు శిఖాచౌదరి, ఆమె బాయ్ ఫ్రెండ్ రాకేష్‌రెడ్డేనని పోలీసులు దాదాపు...

వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. హత్యకు సూత్రధారులు ఆయన మేనకోడలు శిఖాచౌదరి, ఆమె బాయ్ ఫ్రెండ్ రాకేష్‌రెడ్డేనని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే శిఖాచౌదరి, రాకేష్‌‌రెడ్డి, శిఖా స్నేహితుడు శ్రీకాంత్‌తోపాటు లేడీ యాంకర్‌‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన నందిగామ పోలీసులు పలు విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

వ్యాపారవేత్త జయరాం హత్య కేసు కొలిక్కి వస్తోంది. ఆర్ధిక లావాదేవీలే జయరామ్‌ను బలిగొన్నట్లు తెలుస్తోంది. జయరాం మేనకోడలు శిఖా చౌదరి ఆమె బాయ్ ఫ్రెండ్ రాకేష్ రెడ్డే ఈ దారుణానికి పాల్పడినట్లు దాదాపు తేల్చారు. డబ్బు కోసమే జయరాంను రాకేష్‌‌రెడ్డి చంపేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోనే హత్య చేసి కారులో నందిగామ వైపునకు తీసుకెళ్లి ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. నాలుగున్నర కోట్ల రూపాయల అప్పు విషయంలో జయరామ్‌ను రాకేష్‌ మర్డర్ చేసినట్లు తెలుస్తోంది. కుక్కలను చంపే ఇంజక్షన్‌ చేయడంతో పది నిమిషాల్లోనే జయరాం శరీరం మొత్తం విషపూరితమైందని, అలాగే తలపై బీరు బాటిల్ తో కొట్టినట్టు గుర్తించారు. టీవీ యాంకర్ ద్వారా తన ఇంటికి పిలిపించుకుని జయరామ్‌ను రాకేష్‌ హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఇక జయరాంతో తనకు వివాహేతర సంబంధమున్నట్లు ఆయన మేనకోడలు శిఖాచౌదరి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఓ విల్లా విషయంలో జయరాంతో రాకేష్‌కు గొడవులు ఉన్నాయని, అయితే జయరామ్‌ను చంపుతాడని అనుకోలేదని శిఖా చెప్పినట్లు సమాచారం. ఇక తన పేరుపై కొనుగోలు చేసిన 10 ఎకరాల డాక్యుమెంట్లు ఇవ్వకుండా జయరాం ఇబ్బంది పెట్టాడని, ఈ డాక్యుమెంట్ల కోసం జయరామ్‌కు ఓ యువతిని ఎరవేశానని, ఇంటికి కూడా వెళ్లానని శిఖా చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన జయరాం భార్య పద్మశ్రీ స్టేట్‌మెంట్‌ను న్యాయవాది సమక్షంలో నందిగామ పోలీసులు రికార్డు చేశారు. తనకు ఎవరిపైనా అనుమానం లేదన్న జయరాం భార్య తన భర్తను ఎవరు చంపారో ఎందుకు హత్య చేశారో తేల్చాలని పోలీసులను కోరింది. అలాగే తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు కృష్ణాజిల్లా ఎస్పీ త్రిపాఠి నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయానికి వచ్చారు. అయితే జయరామ్ హత్య కేసు గురించి HMTV ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.

అలాగే నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయానికి శిఖాచౌదరి చెల్లెలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆఫీస్‌లోకి వెళ్లేటప్పుడు బ్యాగ్‌తో వెళ్లి వచ్చేటప్పుడు వదిలేసి వచ్చారు. అయితే ఇద్దరిలో ఒకర్ని HMTV ప్రతినిధి ప్రశ్నిస్తే ఓ ల్యాండ్ ఇష్యూ కోసం వచ్చామని చెప్పి కారెక్కి వెళ్లిపోయారు. జయరాం హత్య కేసు ఓ కొలిక్కి వస్తున్నా ఎన్నో ప్రశ్నలు మాత్రం ఇంకా వెంటాడుతున్నాయి. జయరాం మర్డర్‌లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, సహకరించిందెవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories