జవాన్ల త్యాగం వృథా కాదు : ప్ర‌ధాని మోడీ

జవాన్ల త్యాగం వృథా కాదు : ప్ర‌ధాని మోడీ
x
Highlights

పుల్వామా దాడితో దేశమంతా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు పాశవికదాడిపై రగిలిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. రాజకీయ...

పుల్వామా దాడితో దేశమంతా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు పాశవికదాడిపై రగిలిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. రాజకీయ విమర్శలకు అంతేలేకుండా పోయాయి. జవాన్ల త్యాగం వృధా కానివ్వమని ప్రధాని మోడీ తేల్చిచెప్పారు. ఇటు ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ శ్రీనగర్‌కు వెళ్లనున్నారు.

సీఆర్పీఎఫ్‌ 54 వ బెటాలియన్‌కు చెందిన జవాన్లపై ఉగ్రవాదుల దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోడీ జవాన్ల త్యాగాన్ని వృధా కానివ్వమని స్పష్టం చేశారు. హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన అమరులైన జవానుల కుటుంబాలకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌తో మాట్లాడారు. సీఆర్పీఎఫ్‌ డీజీపీతో కూడా మాట్లాడిన ఆయన ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. శ్రీనగర్‌కు వెళ్లనున్న రాజ్‌నాథ్‌ పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇటు జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ పరిస్థితిని సమీక్షించారు. అందుబాటులో ఉన్న అధికారులతో సమావేశమై సమీక్ష చేపట్టారు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని వారికి మర్చిపోలేని గుణపాఠం చెబుతామని ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్రంగా స్పందించారు.

ఇటు ఈ దాడిని రాజకీయ ప్రముఖులంతా తీవ్రంగా ఖండించారు. మరణించిన జవాన్ల కుటుంబాలకు దేశం యావత్‌ అండగా ఉంటుందంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. వారి ప్రాణత్యాగానికి జాతి యావత్తు జోహార్లు అర్పిస్తుందని సంతాపం ప్రకటించారు.

మరోవైపు పుల్వామా దాడి ఘటనపై దేశం యావత్‌ తీవ్ర నిరసనలతో హోరెత్తింది. పార్టీలకతీతంగా రోడ్డుపైకి వచ్చిన జనం.. వారికి తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఉగ్రవాదులను పట్టుకుని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ దాడిపై విపక్షాలు మోడీని టార్గెట్‌ చేస్తూ విమర్శలకు దిగాయి. మోడీ ప్రభుత్వం దేశ భద్రతపై రాజీ పడిందంటూ తీవ్రంగా స్పందించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories