శ్రీశైలం డ్యాంకు ముప్పు పొంచి ఉందా..?

శ్రీశైలం డ్యాంకు ముప్పు పొంచి ఉందా..?
x
Highlights

తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చే బహుళార్థసాధక ప్రాజెక్టు. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరు. కృష్ణమ్మ నీటిని ఒడిసిపట్టే భారీ నిర్మాణం. ఎంతో...

తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చే బహుళార్థసాధక ప్రాజెక్టు. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరు. కృష్ణమ్మ నీటిని ఒడిసిపట్టే భారీ నిర్మాణం. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా పేరుగాంచిన శ్రీశైలం డ్యాంకు ముప్పు పొంచివుందా..? పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నం ఏమిటి..? డ్యామ్‌ భద్రతపై రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు ఏమంటున్నారు..? తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం డ్యాం రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. 2009 వరదల తర్వాత నుంచి ఆనకట్ట ప్లంజ్ పూల్ పటిష్టతపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2012లో ప్లంజ్ పూల్ లోతుపై నిపుణులు అధ్యయనం చేసినా చర్యలేవి తీసుకోలేదు. ప్రస్తుతం మరోసారి ప్లంజ్ పూల్ లోతుపై అధ్యయనం చేయడానికి గోవాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఒషినోగ్రఫీ నిపుణుల బృందం శ్రీశైలం వచ్చింది.

శ్రీశైలానికి వచ్చిన వరద నీటిని గేట్లను తెరిచి కిందకు విడుదల చేయడంతో, ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి డ్యాంపై ఎంత ప్రభావం చూపించగలదోనని నీటిపారుదల శాఖ అధికారులు నిపుణులతో ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. డ్యాంకు ప్రమాదం ఉందా..? అది నిజమైతే దాని తీవ్రత ఎంత ఉండొచ్చు..? ఈ గొయ్యి డ్యాం పునాదుల వరకు ఉందా..? అనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యాయనం చేస్తున్నారు. ప్రాథమికంగా ప్లంజ్ పూల్ వద్ద నీటిలో ఎంత లోతు వెళ్ళవచ్చునని ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సర్వే చేపట్టారు. పది రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నట్టు డ్యాం అధికారులు చెబుతున్నారు. గతంలో చేపట్టిన సర్వే నివేదికలను క్రోడికరించుకుని, ప్రస్తుత సర్వే నివేదికను సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్‌కి, సీడబ్ల్యూసీ ప్రాజెక్టు నిపుణుల బృందానికి పంపించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ సూచనల మేరకు ప్లంజ్ పూల్ పటిష్టతకు చేపట్టే చర్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ప్రాజెక్టు అధికారులు అంటున్నారు.

అసలు ప్లంజ్ పూల్ అంటే ఏమిటి..? ప్లంజ్ పూల్ వల్ల సమస్య ఎందుకు వచ్చింది..? శ్రీశైలం డ్యాంకు ప్రమాదం ఎక్కడ ఉంది..? నిపుణుల ఆందోళనకు కారణమేంటి..?ప్లంజ్ పూల్ అంటే శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి వరద నీరు విడుదలై స్పిల్ వే ద్వారా డ్యాం దిగువున ఉన్న తొట్టిలోకి చేరుతుంది. అక్కడ నుంచి డ్యాం పునాదులకు దూరంగా నీరు పడుతుంది. ఇలా వరద నీరు పడే ప్రాంతాన్ని ప్లంజ్ పూల్ అంటారు. ప్లంజ్ పూల్ పటిష్టతను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ సమయంలోనే బలమైన కాంక్రీట్ డ్రమ్స్‌ను డ్యాంలో ఏర్పాటు చేస్తారు. అయితే 1998, 2009లో శ్రీశైలానికి ఉహించని విధంగా భారీ వరద చేరింది. ఆ సమయంలో గేట్లను పూర్తిస్థాయిలో పైకి తెరవడంతో వాటి ద్వారా విడుదలైన నీటి వేగానికి డ్యాం దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. 1998 వరదల కారణంగా 60 అడుగుల లోతులో ప్లంజ్ పూల్ వద్ద గొయ్యి ఏర్పడింది. 2009లో వచ్చిన వరదల వల్ల 100 అడుగుల లోతుకు ఆ గొయ్యి చేరింది.

ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన ఈ గొయ్యి లోతు, వెడల్పు తెలుసుకునేందుకు గత ఏడాది జనవరి 30న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఒషినోగ్రఫీ సంస్థ బ్యాతమాటికల్ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వే అనంతరం నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరద వల్ల ఏర్పడిన గొయ్యి మరింత విస్తరిస్తే ఆనకట్ట భద్రతపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అయితే 2012లో నిపుణుల అధ్యాయనం నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. దీనికి కారణం మాత్రం తెలియదు.

గత అధ్యయనం ఆధారంగా ప్లంజ్ పూల్ లోతును అండర్ వాటర్ కాంక్రీట్ ద్వారా నిర్ణీత స్థాయిలో సరి చేయాలని నిపుణులు సూచించినట్లు సమాచారం. కానీ ఆ చర్యలేవి ఇంత వరకు తీసుకోలేదు. అలానే కుడిగట్టు పునర్ నిర్మాణంపై ఎందుకు మీన వేషాలు లెక్కిస్తున్నారో అంతుచిక్కడంలేదని నిపుణులు చెబుతున్నారు. ఒకటో నంబర్ గేటుకు అమర్చే ఎలిమెంట్లను తయారు చేసినా ఇంత వరకు బిగించలేదు. ఇలా కీలక పనులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి నిపుణుల బృందం డ్యాం వద్ద అధ్యాయనం చేస్తోంది. ప్లంజ్ పూల్‌తో పాటు ఆనకట్ట రక్షణకు నిర్మాణ సమయంలోనే అమర్చిన కాపర్ సిలిండర్లు ఏ మేర బలంగా ఉన్నాయనే కోణంలో అధ్యయనం చేస్తునట్లు డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories