సార్వత్రిక ఎన్నికల ముందు కోటి కలల బడ్జెట్‌ ..

సార్వత్రిక ఎన్నికల ముందు కోటి కలల బడ్జెట్‌ ..
x
Highlights

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టే బడ్జెట్ పై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే అయినా కేటాయింపులు, తాయిలాలు భారీ...

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టే బడ్జెట్ పై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే అయినా కేటాయింపులు, తాయిలాలు భారీ స్థాయిలోనే ఉండనున్నాయి. రైతులు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను రాయితీని పెంచే అవకాశం ఉంది.

ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. 16వ లోక్‌సభ కాలపరిమితి ఈ ఏడాది మే నెలతో ముగుస్తుండగా ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. నేడు కేంద్ర తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతారు.

ఉదయం 9-30 గంటలకు పీయూష్ గోయల్ ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో సమావేశమవుతారు. బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి అనుమతి తీసుకుంటారు. క్యాబినెట్ సమావేశం తర్వాత పీయూష్ గోయల్ పార్లమెంట్ కు చేరుకుంటారు. స్పీకర్ అనుమతితో లోక్ సభలో 11 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతారు. మధ్యాహ్నం 2గంటలకు రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ ఓట్ ఆన్ బడ్జెట్ ను చదివి వినిపిస్తారు.

మోడి ప్రభుత్వానికి ఇది ఆరో బడ్జెట్. ఎన్నికల బడ్జెట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతాంగానికి బడ్జెట్ లో చేయూత నిచ్చేందుకు కేంద్రం కసరత్తు చేసింది. పెట్టుబడి సాయం నేరుగా రైతులకు అందించే పథకం పట్ల మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రైతుబంధు తో పాటు ఒడిషా సర్కార్ అమలు చేస్తున్న కలియా స్కీంపై దృష్టి సారించింది. కలియా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి 10వేల చొప్పున జమ చేస్తారు. కొద్దిపాటి పొలం ఉన్న వారికి, కౌలుదార్లకు దీన్ని వర్తించే విధంగా దీన్ని రూపొందించారు.

కేంద్రం కూడా ఇదే తరహాలో రాయితీని ప్రకటించాలని ఆలోచిస్తుంది. ఒక ఇంటికి ఒక రాయితీ స్కీం కింద 10వేలు ఏటా రైతు కుటుంబం ఖాతాలో జమ చేస్తారు. ఎరువులు, విత్తనాలు, యంత్ర సామగ్రి కొనుగోలుకు అందజేస్తారు. దీనికి ఏడాదికయ్యే ఖర్చు లక్షన్నర కోట్లు. దీనికితోడు సమాంతరంగా మద్దతు ధర పెంపును అమలు చేయాలని భావిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలు ముందున్నందున వివిధ వర్గాలకు తాయిలాలు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. రైతుల నుంచి నిరుద్యోగుల వరకు దాదాపు 3 లక్షల కోట్ల మేర ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలుస్తుంది. మధ్యతరగతి ఆదాయ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ఆదాయ పన్నురాయితీని 5లక్షలకు పెంచుతారా లేక 8 లక్షలకు పెంచే అవకాశాలున్నాయా అన్న చర్చ సాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories