ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ యుద్దం మొదలైంది...అసలు పోస్టల్ బ్యాలెట్‌ ఓటంటే ఏంటి?

ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ యుద్దం మొదలైంది...అసలు పోస్టల్ బ్యాలెట్‌ ఓటంటే ఏంటి?
x
Highlights

ఒక్క ఓటుతో అభ్యర్థుల తలరాతలు మారతాయి. పది, ఇరవై ఓట్ల తేడాతో ఫలితమే తారుమారైన ఉదంతాలు ఎన్నో. అందుకే ప్రతి ఓటు ఇక్కడ కౌంట్‌. ఎన్నికల తంతు ముగిసింది కదా,...

ఒక్క ఓటుతో అభ్యర్థుల తలరాతలు మారతాయి. పది, ఇరవై ఓట్ల తేడాతో ఫలితమే తారుమారైన ఉదంతాలు ఎన్నో. అందుకే ప్రతి ఓటు ఇక్కడ కౌంట్‌. ఎన్నికల తంతు ముగిసింది కదా, మరి ఇప్పుడెందుకు ఓట్ల ప్రస్తావన అనుకుంటున్నారా వేలల్లో ఉండే ఎన్నికల సిబ్బంది ఓట్లు కూడా ఉన్నాయి. వారు వేసే ఓటు కూడా అత్యంత కీలకం. ఫలితాలను రివర్స్ చేసే అస్త్రాలు బ్యాలెట్ ఓట్లు. అందుకే ఇప్పుడు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల, బ్యాటిల్ మొదలైంది. ఉద్యోగుల చుట్టూ అభ్యర్థులు చక్కర్లు కొడుతున్నారు. ఇంతకీ పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి ఎలా వేస్తారు? వాటి ఎఫెక్ట్‌ విజయావకాశాలపై ఎలా ఉంటుంది.

పోస్టల్‌ బ్యాలెట్లు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు వేసే ఓట్లు. దాదాపు జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లోనూ సుమారు రెండు, మూడు వేల వరకూ ఉంటాయి. ఫలితంపై ఇవి కచ్చితమైన ప్రభావం చూపుతాయి. అందుకే నాయకులు ఇప్పుడు ఉద్యోగుల వెంట పడుతున్నారు. ఇప్పుడెక్కడ చూసినా పోస్టల్‌ బ్యాలెట్లపై చర్చలే వినిపిస్తున్నాయి.

ఏప్రిల్ 11నే ఎన్నికల తంతు ముగిసింది. ఇక మిగిలింది లెక్కింపు మాత్రమే. దీనికి ముందు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్లు వేయాల్సి ఉంది. ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు వరకూ అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఓట్ల చుట్టూనే రాజకీయం సాగుతోంది. గెలుపునకు చివరి అవకాశంగా అభ్యర్థులు పోస్టల్‌ ఓట్ల వెంట పడుతున్నారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 52 వేల మంది ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ప్రకాశంజిల్లాలో మొత్తం 31,510 వరకూ పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో 16,969, కందుకూరు నియోజకవర్గంలో 2079 ఉన్నాయి. బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని నాలుగు శాసనసభ స్థానాల్లో మరో 12,460 వరకూ ఉంటాయి. ఈ ఓట్లలో ప్రస్తుతానికి కేవలం 25 శాతం మాత్రమే పోలయ్యాయి. లెక్కింపునకు ఒక రోజు ముందు అంటే, మే 22 వరకూ సమయం ఉండటంతో అప్పటి వరకూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు ఉద్యోగులు.

ఇదే అదనుగా అభ్యర్థులు కూడా వారి వెంట తిరుగుతున్నారు. సంప్రదింపులు జరుపుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున డబ్బులు పంచేందుకూ అభ్యర్థులు వెనకాడ్డంలేదు. కొందరు ఉద్యోగులు ఎవరు గెలుస్తారో ముందే ఊహించుకుని, తమ అంచనాల ద్వారా వారి వద్దకే వెళ్లి తమ ఓటును చేతికి ఇచ్చివస్తున్నట్లు సమాచారం. మరి కొందరు ఉద్యోగుల చుట్టూ రాజకీయ నాయకుల ఏజెంట్లు చక్కర్లు కొడుతూ సామూహికంగా కొంత ధర మాట్లాడుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

పోస్టల్‌ ఓట్లు వేసేందుకు రెండు మార్గాలున్నాయి. తమకిచ్చిన పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌లో ఓటు వేసి నేరుగా కార్యాలయంలోని డబ్బాలో వేయవచ్ఛు లేదా పోస్టు ద్వారా పంపించవచ్ఛు. కానీ, ఈ రెండు విధానాల్లోనూ చిక్కులు ఎదురవుతున్నాయి. ఓటర్లకు కొన్ని నియోజకవర్గాల్లో అసలు ఓట్లు వేసిన తర్వాత అందించే దారి తెలియడం లేదు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసేందుకు కొన్ని నియోజకవర్గాల

ఎన్నికల అధికారి కార్యాలయాల్లో డబ్బాలు ఏర్పాటు చేయలేదు. పోనీ, పోస్టు ద్వారా కార్యాలయాలకు చేరేలా పంపాలన్నా సాధారణ పోస్టు ద్వారానే ఇవ్వాలి. రిజిస్టర్‌ పోస్టు చేసే వీలు లేదట. సాధారణ పోస్టు చేస్తే అది ఎన్నటికి చేరుతుందో? అసలు చేరుతుందో? లేదో? తెలియక తికమకలో ఉన్నారు ఉద్యోగులు. అన్ని కార్యాలయాల్లో డబ్బాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మొత్తానికి గెలుపోటముల్లో, పోస్టల్ బ్యాలెట్లు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే, చాలా నియోజకవర్గాల్లో కేవలం 30 నుంచి వెయ్యిలోపు ఓట్ల తేడాతోనే విజయావకాశాలు తారుమారు అవుతాయని, అందుకు గతంలో గెలిచిన కొందరు అభ్యర్థులే కారణమని చెబుతున్నారు. హోరాహోరిగా పోరు సాగిందని చెబుతున్న ఏపీ ఎన్నికల్లో, కొన్ని ఓట్ల తేడాతో ఫలితం రివర్స్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. అందుకే ప్రతి ఓటూ ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు వేల దాకా ఓట్లుండే పోస్టల్‌ బ్యాలెట్లను అత్యంత కీలకంగా అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. సామదానదండోపాయాలతో వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories