logo

ప్రచారానికీ ఉందో ప్యాకేజీ!

ప్రచారానికీ ఉందో ప్యాకేజీ!

ఎన్నికలంటే ముందుగా గుర్తొచ్చేది ప్రచారాల సందడే. గతంలో ఆయా పార్టీల కార్యకర్తలే జెండాలు భుజాన వేసుకుని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారిపోయింది. ప్రచారానికీ ప్యాకేజీలొచ్చేశాయి. దీంతో ఆఫ్ డే, ఫుల్‌ డే స్పెషల్ ప్యాకేజీలతో ప్రచారకర్తలు రంగంలోకి దిగిపోతుంటారు. ఏంటా స్పెషల్ ప్యాకేజీలు..? ఎవరా ప్రచారకర్తలు ..?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికల జాతర మొదలైంది. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో అన్ని పార్టీలూ ప్రచారంపై దృష్టిపెట్టాయి. గతంలో ఆయా పార్టీల కార్యకర్తలే జెండాలు భుజాన వేసుకుని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారడంతో ప్రచారానికీ ప్యాకేజీలొచ్చేశాయి. ఫుల్ డే, ఆఫ్ డే ప్యాకేజీలతో ప్రచారకర్తలు రంగంలోకి దిగిపోతున్నారు. అంటే ఇవాళ ఒక పార్టీకి ప్రచారం చేసిన బృందమే రేపు మరో పార్టీ జెండాలతో ప్రత్యక్షమవుతోంది.

దీనికోసం ముందుగానే 10 మంది స్త్రీలు, 10 మంది పురుషులతో బృందాలను సిద్ధం చేస్తున్నారు. రెండు పూటలా అయితే 300 రూపాయలు, ఒకపూటకు అయితే 200 చొప్పున చెల్లిస్తారు. పురుషులకు మాత్రం రెండు పూటలా ప్రచారం చేస్తే మద్యం కోసం అదనంగా 100 రూపాయలు ఇస్తారు. అయితే, ఇదంతా భారంగా మారడంతో కొందరు అభ్యర్థులు కాంట్రాక్టు విధానం వైపు మొగ్గుతున్నారు. ఈ విధానంలో 20 మంది సభ్యుల బృందం ఒక్కో డివిజన్‌లో ముందుగా నిర్ణయించుకున్న రోజుల్లో ప్రచారం చేన్తుంది.

దీనికోసం నేతలు కాంట్రాక్టరుకు గుత్తగా డబ్బు అందిస్తారు. అతను పదో పరకో కమీషన్‌ మిగల్చుకుని మిగతాది బృందంలోని వారికి ఇస్తాడు. ఈసారి వ్యవధి తక్కువగా ఉండటంతో పలుచోట్ల ప్రచార కార్యకర్తలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో డిమాండ్ విపరీతంగా ఉంది.

ఆడవాళ్లకైతే 200! బిర్యానీ ప్యాకెట్‌ బోనస్‌. మరి మగవాళ్లకి అంతా సపరేటు. ఉదయం టిఫిన్‌. మధ్యాహ్నం కడుపు నిండా భోజనం. రాత్రి పొద్దుగూకిందంటే చాలు.. ఓ క్వార్టర్‌. మొత్తం అంతా కలిపి 500 ఇవ్వాలి. సో...ఎన్నికల వేళ ఈ మాత్రం హంగూ ఆర్బాటం ఉండాలంటే ఈ ప్యాకేజీలు తప్పవు మరి.

లైవ్ టీవి

Share it
Top