ఒక్కరే...రెండెందుకు?

ఒక్కరే...రెండెందుకు?
x
Highlights

ఏపీ ఎన్నికల్లో ఒకే అభ్యర్థి రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగే పరంపర ప్రస్తుత ఎన్నికల్లో సైతం కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర,...

ఏపీ ఎన్నికల్లో ఒకే అభ్యర్థి రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగే పరంపర ప్రస్తుత ఎన్నికల్లో సైతం కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రలోని ఒక్కో స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ కు ముందే ఈ ఘనత సాధించిన నాయకులెవరో ఓసారి చూద్దాం.

భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వచనం కాలంతో పాటు మారుతూ వస్తోంది. గతంలో హుందాగా సాగిన ఎన్నికల్లు ప్రస్తుతం వివిధ రాజకీయపార్టీలలోని ధనికవర్గాల బలప్రదర్శనగా మారిపోయింది. ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగానో పార్లమెంట్ సభుడిగానో ఎన్నిక కావటం సంగతి అటుంచి సీటు సాధించడానికే గొప్పపోరాటం చేయాల్సి వస్తోంది. సీటు సంపాదించగలిగితే సగం విజయం సాధించినట్లుగానే పరిగణించే పరిస్థితి ఏర్పడింది.

ఓ వైపు వివిధ పార్టీల తరపున సీట్లు సాధించడానికి నానాపాట్లు పడే అభ్యర్థులు ఓవైపు ఏమాత్రం ఒత్తిడి లేకుండా తమకు నచ్చిన ఒకటి లేదా రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్ధులు మరోవైపు మనకు కనిపిస్తారు. గత మూడున్నర దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఒకే అభ్యర్థి రెండు లేదా మూడు స్థానాల నుంచి పోటీకి దిగిన సందర్భాలు చేతివేళ్ల మీద లెక్కించగలిగినన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి.

ప్రస్తుత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 స్థానాలలో వివిధ పార్టీలకు చెందిన వందలాదిమంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అయితే తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తన సోదరుడు చిరంజీవీ బాటలోనే నడవాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని ఒక్కో స్థానం నుంచి తానే పోటీ చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించడమే కాదు గాజువాక, భీమవరం స్థానాల నుంచి జనసేన అభ్యర్థిగా నామినేషన్లు సైతం దాఖలు చేశారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓ అభ్యర్థి రెండు లేదా మూడు స్థానాల నుంచి పోటీకి దిగటం ఇదే మొదటిసారికాదు. 1983 నుంచి 1989 ఎన్నికల వరకూ ఎన్టీఆర్, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రెండు లేదా మూడు నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచిన రికార్డులు ఉన్నాయి. ఒకే వ్యక్తి రెండు లేదా మూడు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగటంపై ఆసక్తికరమైన చర్చ మాత్రమే కాదు భిన్నవాదనలు సైతం వినిపిస్తునాయి.

ఒక చోట ఓడినా మరో చోట గెలవచ్చన్న భావనతోనే ఇలా జరుగుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తుంటే కార్యకర్తల్లో జోష్ నింపటానికే అంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఒకే వ్యక్తి రెండు స్థానాల నుంచి పోటీకి దిగటం వల్ల ఎన్నికల సంఘానికి అదనపు ఖర్చు మినహా మరేమీ కాదని కూడా అనేవారు లేకపోలేదు.

1983 ఎన్నికల్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్ రెండు స్థానాల నుంచి తొలిసారిగా పోటీకి దిగారు. కోస్తాంధ్రలోని గుడివాడ, రాయలసీమ లోని తిరుపతి నియోజకవర్గాల బరిలో నిలవటమే కాదు విజేతగాను ఎన్టీఆర్ నిలిచారు. ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన 1985 ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ ఏకంగా మూడు ప్రాంతాల నియోజకవర్గాల నుంచి పోటీకి దిగి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, తెలంగాణా , కోస్తాంధ్ర ప్రాంతాలలోని ఒక్కో స్థానం నుంచి సమరశంఖం పూరించారు. మూడుకు మూడుస్థానాల నుంచి ఎన్టీఆర్ విజయం సాధించారు. గుడివాడ, నల్గొండ, హిందూపూర్ ఓటర్ల ఆదరాభిమానాలు చవిచూశారు. అంతేకాదు 1989 ఎన్నికల్లో తెలంగాణాలోని కల్వకుర్తి, కోస్తాంధ్రలోని గుడివాడ స్థానాల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఎన్టీర్ గుడివాడలో నెగ్గి కల్వకుర్తిలో ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్య అధినేతగా ఎన్నికల సమరానికి దిగిన చిరంజీవి రెండుస్థానాల నుంచి పోటీకి దిగి మిశ్రమఫలితాలు ఎదుర్కొన్నారు. రాయలసీమలోని తిరుపతి నియోజకవర్గంలో నెగ్గిన చిరంజీవికి పాలకొల్లులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో పరాజయం తప్పలేదు.

1996కు ముందు మాత్రమే ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీకి దిగే అవకాశం ఉండేది. 1951 ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణ చేయటం ద్వారా ఒక అభ్యర్థి కేవలం రెండుస్థానాల నుంచి మాత్రమే పోటీకి దిగేలా సవరణ చేశారు. ఒకే వ్యక్తి రెండు లేదా మూడు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కేవలం పార్టీ అధినేతలకు మాత్రమే ఉంటుందని టీడీపీ, ప్రజారాజ్యం, జనసేన పార్టీల స్థాపకులు ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లను చూస్తేనే తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories