ఏపీలో నామినేషన్ల హోరు...

ఏపీలో నామినేషన్ల హోరు...
x
Highlights

ఏపీలో 4వరోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, మంత్రులు, మాజీ మంత్రులు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అట్టహాసంగా నామినేషన్లు...

ఏపీలో 4వరోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, మంత్రులు, మాజీ మంత్రులు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అట్టహాసంగా నామినేషన్లు వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఏపీలో నామినేషన్లు జోరందుకున్నాయి. పార్టీల్లో సీట్ల వ్యవహారం కొలిక్కి రావడంతో నాల్గో రోజు పెద్ద ఎత్తున దాఖలయ్యాయి. విశాఖ సౌత్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా, గాజువాకలో జనసేన పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అట్టహాసంగా నామినేషన్లు వేశారు.

కృష్ణాజిల్లాలో చూస్తే మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరరావు, కొల్లు రవీంద్ర, కె.ఎస్. జవహర్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమా, మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కొల్లు రవీంద్ర, తిరువూరు నుంచి జవహర్, అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్లు వేశారు. అలాగే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి పెనమలూరు నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి మాజీమంత్రి తమ్మినేని సీతారాం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ కూన రవికుమార్ నామినేషన్ వేశారు. రాజం నుంచి కొండ్రు మురళీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబు, రామచంద్రాపురం నుంచి తోట త్రిమూర్తులు, ప్రత్తిపాడు నుంచి వరుపుల రాజా, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

ఇక గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లాలో చూస్తే శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, బనగానపల్లె అసెంబ్లీ స్థానం నుంచి కాటసాని రామిరెడ్డి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైసీపీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, ఆత్మకూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా కర్నాటి ఆంజనేయరెడ్డి కూడా నామినేషన్ వేశారు.

మరోవైపు కడప, నరరావుపేట, అనంతపురం లోక్‌సభ వైసీపీ అభ్యర్థులుగా అవినాష్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయులు, తలారి రంగయ్య నామినేషన్లు దాఖలు చేయగా తిరుపతి, కర్నూలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థులుగా పనబాక లక్ష్మీ, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, నంద్యాల లోక్‌సభ జనసేన అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి నామినేషన్లు వేశారు. నామినేషన్లకు నేతలు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలతో తరలివస్తుండటంతో కోలాహలం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories