ఈసీకి ఇందూరు సవాల్

ఈసీకి ఇందూరు సవాల్
x
Highlights

185 మంది తలపడుతున్న నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణ ఎన్నికల కమిషన్ కు సవాల్ గా మారింది. నిజామాబాద్ లో ఈవీఎంలను వాడాలని ఎన్నికల...

185 మంది తలపడుతున్న నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణ ఎన్నికల కమిషన్ కు సవాల్ గా మారింది. నిజామాబాద్ లో ఈవీఎంలను వాడాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడంతో ఇవాళ్టి నుంచి బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లను, వీవీ ప్యాట్ యంత్రాలను తరలిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే భారీ సంఖ్యలో అభ్యర్థులున్న చోట పోలింగ్ జరపడం ఒక ఎత్తయితే ఓటర్లు ఓటేయడం మరో ఎత్తు. 185 గుర్తులను వెతుక్కొని మరీ ఓటేయడం ఓటర్లకు అగ్ని పరీక్షగా మారనుంది

నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడం, ఈవీఎంలతోనే పోలింగ్ జరుపుతామని ఈసీ స్పష్టం చేయడంతో అక్కడ ఏ పోలింగ్‌ స్టేషన్‌లో చూసినా పెద్ద మొత్తంలో ఈవీఎంలు దర్శనమివ్వనున్నాయి. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడంవల్ల ఒకే పోలింగ్ బూత్ లో 12 ఈవీఎంలు పెట్టాల్సి రావడం ఈసీకి ఓ సవాల్‌ గా మారింది. అంతేకాదు ఓటర్లు ఓటేయడం కూడా కచ్చితంగా మరో సవాలే.

185 మంది బరిలో ఉన్న నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో మొత్తం 1,788 పోలింగ్‌ కేంద్రాలను రెడీ చేస్తున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 12 బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుపుతున్నారు. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. అయితే ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేసేందుకు ఏదో ఒక బ్యాలెట్‌ యూనిట్‌ను చూస్తానంటే కుదరదు. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌‌లోని పేర్లను వారి గుర్తులను చూసుకుంటూ అన్నింటిని పరిశీలించాలి. మొత్తం 12 ఈవీఎంలను చూశాక మాత్రమే ఓటేయాలి. ఈ 12 బ్యాలెట్ యూనిట్లలో తనకు నచ్చిన అభ్యర్థిని వెతికి పట్టుకొని ఓటేయాలి. అంతేకాదు ఓటేసిన 7 సెకన్లలోపు వీవీప్యాట్‌ యంత్రంలో తమ ఓటు సరిగా వేశామో లేదో చెక్ చూసుకోవాలి. ఈ సుదీర్ఘ ఓటింగ్ ప్రక్రియే అందరినీ భయపెడుతోంది.

అయితే 12 బ్యాలెట్ యూనిట్లలో తొలి ఈవీఎంలోనే ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లు ఉంటాయని ఈసీ ప్రకటించింది. ఇది ఒక్కటే ప్రధాన పార్టీలకు ఓటేసే ఓటర్లకు ఊరటనిచ్చే అంశం. ఒక్కో ఓటరు 12 ఈవీఎంలను తప్పనిసరిగా చూడాల్సి ఉన్నా ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ముందే కనిపిస్తాయి కాబట్టి పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదని ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు. అయితే 185 గుర్తులు ఒకదానిని మరొకటి పోలి ఉంటే అవకాశం ఉంది కాబట్టి కొందరు ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.

అంతేకాదు నిజామాబాద్‌ ఎంపీ స్థానం పరిధిలో అభ్యర్థులు ప్రతి పోలింగ్ బూత్ లో ఒక ఏజెంటును నియమించుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం 1,788 పోలింగ్‌ స్టేషన్లకు 185 మంది చొప్పున 3 లక్షల 30 వేల 780 మంది పోలింగ్‌ ఏజెంట్లు అవసరం అవుతారు. అందరు అభ్యర్థులు పోలింగ్‌ ఏజెంట్లను నియమించుకుంటే వారి సంఖ్య ఓ రికార్డవుతుందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories