ఇందూరులో మహిళలే నిర్ణేతలు

ఇందూరులో మహిళలే నిర్ణేతలు
x
Highlights

తెలంగాణ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇందూరులో మహిళలే నిర్ణేతలుగా మారనున్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా, మహిళలే ఆధిపత్యం...

తెలంగాణ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇందూరులో మహిళలే నిర్ణేతలుగా మారనున్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా, మహిళలే ఆధిపత్యం చెలాయించనున్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో 76,112 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లు ఎవరికి మొగ్గు చూపితే వారే విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు మహిళల ఓట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో మహిళలే తమ సత్తా చాటనున్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలు ఉండగా, మొత్తం 15,53,301 మంది ఓటర్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 7,38,577 మంది ఉండగా, మహిళా ఓటర్లు 8,14,689 కాగా, ఇతరులు 35 మంది ఉన్నారు. ఈ లెక్కన చూస్తుంటే నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 76,112 మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి.

2018, డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ మహిళల ఓట్లు ఎక్కువగా పోల్‌ అవడంతో వారే గెలుపు నిర్ణేతలుగా మారారు. జగిత్యాల నియోజకవర్గంలో 2,13,901 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,03,736 మంది కాగా, మహిళలు 1,10,162 మంది. ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుషులకంటే 6426 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 2,27,284 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,08,631 మంది పురుష ఓటర్లు, 1,18,653 మంది మహిళలు ఉన్నారు.

ఇక బాల్కొండ నియోజకవర్గంలో 2,06,383 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 94,921 మంది, మహిళలు 1,11,458 మంది, నలుగురు ఇతరులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 16,537 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో 1,92,706 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 89,997 మంది, మహిళలు 1,02,704 మంది, ఐదుగురు ఇతరులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 12,707 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

బోధన్‌ నియోజకవర్గంలో 2,07,379 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 99,913 మంది పురుషులు, 1,07,463 మంది మహిళలు, ముగ్గురు ఇతరులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 7550 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 2,69,028 మంది ఓటర్లు ఉండగా, 1,31,272 మంది పురుషులు, 1,37,738 మంది మహిళలు, ఇతరులు 18 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 6466 మంది మహిళా ఓటర్లు ఎక్కువ గా ఉన్నాయి. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 2,36,620 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,10,107 మంది పురుషులు కాగా, 1,26,511 మంది మహిళలు ఉండగా, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

దీంతో ఇందూరు లోక్‌సభలో మహిళల ఓట్లు కీలకంగా మారాయి. మహిళలే ఎక్కువగా ఉండటంతో ఇక్కడ అభ్యర్థుల గెలుపు, ఓటములను శాసించే అవకాశం అతివల చేతుల్లోనే ఉంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళల ఓట్లే ఎక్కువగా అభ్యర్థులపై ప్రభావం చూపాయి. 2018, డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజవర్గంలో పురుషులు 70,647 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే, మహిళలు 87,947 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని 70,456 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకుంటే, మహిళలు 92,761 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో మహిళలే అధికంగా ఓటు హక్కును వినియోగించుకోవడంతో మహిళల ఓట్లే కీలకంగా మారాయి.

ఇక్కడ మహిళల ఓట్లే కీలకంగా మారడంతో అభ్యర్థులంతా మహిళల చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం వ్యవసాయ ప్రాంతం కాగా, మహిళలు కూడా పెద్దసంఖ్యలోనే ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తుంటారు. దీనికి తోడు నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో బీడీ పరిశ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. నిజామాబాద్‌ జిల్లాలో బీడీ పరిశ్రమపై ఆధారపడినవారు లక్షా 50 వేల మందికి పైగా ఉన్నారు. ఇందులో 96,300 మంది ఇప్పటికే బీడీ కార్మికుల జీవన భృతి పొందుతున్నారు. జిల్లాలో లక్షకు పైగానే బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తుండగా, ప్రస్తుతం 85,600 మంది పింఛన్లు పొందుతున్నారు. దీనికి తోడు మహిళా సంఘాలు కూడా ఈ ప్రాంతంలో ముఖ్య భూమిక పోషిస్తుంటాయి.

వరిధాన్యం కొనుగోలులో ఐకేపీ సంఘాలు కీలక పాత్ర పోషిస్తుండగా, పొదుపు ఉద్యమంలో కూడా ఈ ప్రాంత మహిళలు మంచి గుర్తింపు పొందారు. చైతన్యవంతులైన మహిళలు ఇందూరు లోక్‌సభ పరిధిలో ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు ఈ లోక్‌సభ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులు మహిళల ఓట్లపైనే దృష్టి కేంద్రీకరించి ప్రచారం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories