Top
logo

కొత్తగా మంత్రులు కాబోతున్న వారి బయోగ్రఫీ

కొత్తగా మంత్రులు కాబోతున్న వారి బయోగ్రఫీ
X
Highlights

సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి అవకాశం కల్పించారు. వీరిలో కేసీఆర్ సన్నిహితులు, సీనియర్...

సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి అవకాశం కల్పించారు. వీరిలో కేసీఆర్ సన్నిహితులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలిచిన తొలిసారే నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డిలకు మంత్రి పదవి వరించింది. కొత్తగా మంత్రులు కాబోతున్న వారి బయోగ్రఫీ చూద్దాం.

కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఎస్సీ వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన బీఏ చదువుకున్నారు. 26 ఏళ్లపాటు సింగరేణిలో ఉద్యోగం చేశారు.

1994లో ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారం నియోజవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పోటీ చేసి ఓడిపోయారు 2001లో టీఆర్ ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిన కొప్పుల ఈశ్వర్ 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పై గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో ఎమ్మెలే పదవికి కొ్ప్పుల ఈశ్వర్ రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పై విజయం సాధించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పాటైన కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేల్లో ఒకరైన కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ నమ్మిన వ్యక్తుల్లో ఒకరిగా పేరుంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ప్రముఖ అడ్వకేట్ గా పేరున్న నిరంజన్ రెడ్డి 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ లో వివిధ బాధ్యతలు నిర్వహించిన నిరంజన్ రెడ్డి మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో వనపర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ తనకు అత్యంత సన్నిహితుడైన నిరంజన్ రెడ్డిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి అప్పజెప్పి తగిన స్థానం కల్పించారు కేసీఆర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి తిరిగి నిరంజన్ రెడ్డి పోటీ చేసి 51 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి లభించిన ఎమ్మెల్యేల్లో నిరంజన్ రెడ్డి ఒకరు.

మహబూబ్ నగర్ మున్సిపాల్టీలో శానీటర్ ఇన్ స్పెక్టర్ గా పని చేసిన శ్రీనివాస్ గౌడ్ ఆ తర్వాత జీహెచ్ ఎంసీ లోని వివిధ డివిజన్ల డిప్యూటీ కమిషనర్ గా పని చేశారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం స్థాపించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల తరపున శ్రీనివాస్ గౌడ్ చురుకైన పాత్ర వహించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. శ్రీనివాస్ గౌడ్ ను పార్లమెంటరీ సెక్రటరీగా సీఎం కేసీఆర్ నియమించగా, కోర్టు తీర్పుతో ఆ పదవి రద్దయ్యింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. వరుసగా రెండు సార్లు గెలుపొందిన శ్రీనివాస్ గౌడ్ కు ఈ సారి మంత్రి వర్గంలో చోటు కల్పించారు కేసీఆర్.

తెలంగాణ సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లావాసి. 1982లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ప్రభుత్వ విప్ గా పని చేశారు.

2008 లో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వరంగల్ సీటు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన ఎర్రబెల్లి 2009లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తో కలిసి బాబ్లీ ప్రాజెక్ట్ ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్ పై తీవ్ర స్థాయిల్లో విమర్శించిన టీడీపీ నేతల్లో ఎర్రబెల్లి ఒకరు. 2014 ఎన్నికల్లో పాలకుర్తి టీడీపీ అభ్యర్థిగా ఐదోసారి పోటీ చేసి గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ శాసనసభ సభాపక్షంగా పని చేశారు. 2016లో టీడీపీకి రాజీనామా చేసి ఎర్రబెల్లి టీఆర్ ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేల్లో ఎర్రబెల్లి ఒకరు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యాపారవేత్త చామకూర మల్లారెడ్డి. డిగ్రీ డిస్ కంటిన్యూ చేసిన మల్లారెడ్డి తన పేరిట పలు విద్యా సంస్థలను నెలకొల్పారు. రాజకీయాల్లో ప్రవేశించి టీడీపీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి మల్లారెడ్డి టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరపున విజయం సాధించిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మల్లారెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మల్లారెడ్డికి మంత్రి పదవి లభించింది.

సీఎం కేసీఆర్‌ సన్నిహితుల్లో వేముల ప్రశాంత్‌ రెడ్డి ఒకరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం వైస్ చైర్మెన్ గా వేముల ప్రశాంత్ రెడ్డి పని చేశారు. ఆ స్కీమ్ జాతీయ స్థాయిలో గుర్తింపుకు కృషి చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండో సారి వేముల ప్రశాంత్ రెడ్డి కి మంత్రివర్గంలో స్థానం కల్పించారు సీఎం కేసీఆర్.

Next Story