logo

ఏపీ నేతలు ప్రతీసారి యూ టర్న్‌ తీసుకుంటున్నారు: మోడీ

ఏపీ నేతలు ప్రతీసారి యూ టర్న్‌ తీసుకుంటున్నారు: మోడీ
Highlights

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే అన్నదాతలు, సైనికులు సురక్షితంగా ఉంటారని ప్రధాని మోడీ అన్నారు. పలు మార్లు...

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే అన్నదాతలు, సైనికులు సురక్షితంగా ఉంటారని ప్రధాని మోడీ అన్నారు. పలు మార్లు మాటలు మార్చే నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని, అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఉత్తరాంధ్రను తమ ప్రభుత్వం తప్పక అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు ప్రధాని మోడీ.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ రైల్వే మైదానంలో నిర్వహించిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ప్రధాని పాల్గొన్నారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రాంతమని, తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన నగరమని కొనియాడారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా దేశాభివృద్ధిలో విశాఖది ప్రధాన పాత్ర అని మోడీ కొనియాడారు.

దశాబ్దాల నాటి విశాఖ రైల్వే జోన్‌ కలను సాకారం చేశామని ప్రధాని మోడీ విశాఖ వేదికగా తెలియచేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ బాగా అభివృద్ధి చెందుతుందని, దీంతో విశాఖ ప్రాంతం ఎంతో ప్రగతి సాధిస్తుందని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత విస్తరిస్తున్నామని, అనేక కార్యక్రమాల ద్వారా నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మారుస్తున్నామని మోడీ వివరించారు. ఐఐఎం, పెట్రోలియం కాంప్లెక్స్‌, లాజిస్టిక్స్‌ హబ్‌ తీసుకొచ్చామన్నారు. విశాఖ రిఫైనరీ ఆధునీకీకరణ పనులు చేపట్టామని అన్నారు.

తమదంతా పారదర్శక పాలన అని, అందుకే తాము ఎవరికీ భయపడమని చెప్పారు మోడీ. ఏపీలో నేతలు ప్రతీసారి యూ టర్న్‌ తీసుకుంటున్నారని అన్నారు. పలుమార్లు మాటలు మార్చే నేతల వైఖరిని గమనించాలని కోరారు. దేశరాజధానిలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుందని, కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. బలమైన ప్రభుత్వంతోనే రైతులు, జవాన్లు క్షేమంగా ఉంటారని ప్రధాని సెలవిచ్చారు.


లైవ్ టీవి


Share it
Top