Top
logo

భీమిలి కాదని వైజాగ్‌ను ఎంచుకోవడానికి కారణమేంటి?

భీమిలి కాదని వైజాగ్‌ను ఎంచుకోవడానికి కారణమేంటి?
Highlights

కుప్పమన్నారు. గుంటూరన్నారు. చివరికి భీమిలి కూడా అనేశారు. ఇప్పుడు కొత్త నియోజకవర్గం తెరపైకి వస్తోంది. నారా వారి ...

కుప్పమన్నారు. గుంటూరన్నారు. చివరికి భీమిలి కూడా అనేశారు. ఇప్పుడు కొత్త నియోజకవర్గం తెరపైకి వస్తోంది. నారా వారి వారసుడు లోకేష్‌ బాబును, ప్రత్యక్ష యుద్ధంలోకి దింపుతున్న చంద్రబాబు, రకరకాల సమీకరణల నేపథ్యంలో ఒక సెగ్మెంట్‌‌ను దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. ఇంతకీ నారా లోకేష్‌ ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఆ స్థానమే ఎందుకు సేఫ్‌ అని భావిస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌, ప్రత్యక్ష ఎన్నికల యుద్ధంలోకి దిగాలని డిసైడయ్యారు. షార్ట్‌కట్‌లో ఎమ్మెల్సీ పదవి పొంది, మంత్రి అయ్యారని ప్రత్యర్థులు అనేక బాణాలు విసరడంతో, ఇక వాటిని తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనువైన నియోజకవర్గం ఏంటా అని, కొన్ని నెలల పాటు అన్వేషించిన లోకేష్‌కు, సాగరతీరం అట్రాక్టివ్‌గా కనపడుతున్నట్టు తెలుస్తోంది.

ఇంతకీ లోకేష్‌ పోటీ ఎక్కడి నుంచో తెలుసా..?

భీమిలి కాదు..మరి ఏది?

విశాఖపట్నం నార్త్...అవును. విశాఖ నార్త్ నుంచి లోకేష్‌ బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు కూడా ఓకే అన్నారని సమాచారం. విశాఖ ఉత్తరం నుంచి కంటెస్ట్ చేసేందుకు చినబాబు కూడా సంసిద్దత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇక అధికారికంగా రంగంలోకి దిగడమే తరువాయి.

చినబాబు పోటీచేసే స్థానంపై అనేక రకాల ప్రచారం జరిగింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల పేర్లు తెరపైకి వచ్చాయి. కుప్పం నుంచి లోకేష్‌ను పోటీ చేయించి చంద్రబాబు అమరావతి పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి. తర్వాత గుంటూరు జిల్లాలో పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి మళ్లీ కృష్ణాజిల్లా పెనమలూరు ఖాయమని ప్రచారం జరిగింది. చివరికి విశాఖ జిల్లాకు మారింది లోకేష్ యుద్ధం.

అటు ఇటు అన్వేషించి

విశాఖ ఉత్తరమే ఎందుకు?

భీమిలి కాదని వైజాగ్‌ను

ఎంచుకోవడానికి కారణమేంటి?

విశాఖ నార్త్‌పై

నారా గురి ఏంటి?

నారాలోకేష్‌ భీమిలి నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఈమేరకు ఆల్రెడీ టీడీపీ అధిష్టానం అక్కడ సర్వే చేయించింది. లోకేష్‌కు లైన్‌ క్లియర్ చేసింది. కానీ అనూహ్యంగా విశాఖ నార్త్ తెరపైకి వచ్చింది. ఉత్తరం టిక్కెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు పార్టీ అధినేతను కలవగా లోకేశ్‌ పోటీ చేస్తున్నారని, ఆయనకు సహకరించాలని సూచించినట్టు తెలిసింది. ఏకంగా సీఎం తనయుడే రంగంలోకి దిగుతుండటంతో, ఆశావహులంతా నిరాశగా వెనుతిరిగారని తెలుస్తోంది. అయితే, విశాఖ నార్తే ఎంచుకోవడం వెనక అనేక సమీకరణాలున్నాయని తెలుస్తోంది.

చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా, చాలా స్టడీ చేస్తారని, పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు. అందులోనూ తన కుమారుడి ప్రత్యక్ష ఎన్నికల పోరు కాబట్టి, అనేక కోణాల్లో అధ్యయనం చేశారు బాబు. విశాఖ ఉత్తరం బరిలో లోకేష్‌ను నిలపడం వెనకా చాలా కసరత్తే జరిగిందట. మొదట భీమిలితో పాటుగా గుంటూరు జిల్లా పెద‌కూర‌పాడు సీటుపైనా చ‌ర్చ జ‌రిగింది. అయితే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాయ‌ల‌సీమ నుంచి బరిలో నిలుస్తుండటంతో, మంత్రి లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే సానుకూల సంకేతాలు వ‌స్తాయ‌ని బాబు భావనట. అందుకే విశాఖ నార్త్‌పై దృష్టిపెట్టారు.

విశాఖ నార్త్‌లో క‌మ్మ వ‌ర్గంతో పాటుగా క్షత్రియ సామాజిక వ‌ర్గం, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇక‌,2014 ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసి గెలిచారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో విశాఖ పార్లమెంట్ పోరులో వైసిపి అభ్యర్ధి విజ‌య‌మ్మపై బిజెపి అభ్యర్ధి హ‌రిబాబుకు 26 వేల 103 ఓట్ల మెజార్టీ ద‌క్కింది. ఇక‌, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఇక్కడి నుండి తిరిగి పోటీ చేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నా ఏ పార్టీ నుండి చేస్తారో మాత్రం చెప్పటం లేదు. కానీ బీజేపీ నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. బీజేపీ పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో, అది టీడీపీకి ప్లస్ అవుతుందని, నారాలోకేష్‌కు కలిసొస్తుందని చంద్రబాబు లెక్కలేస్తున్నారు.

లోకేష్‌కు విశాఖ నార్త్‌ కేటాయించడంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. తొలుత భీమిలి నుండి పోటీ చేయాల‌ని లోకేష్ భావించినా ఇప్పుడు విశాఖ ఉత్తరం నియోజ‌క‌వ‌ర్గానికి మార‌టం వెనుక తాజాగా సిబిఐ మాజీ జేడి ల‌క్ష్మీనారాయ‌ణ టిడిపిలోకి వ‌స్తారన్న వార్తలే కారణమట. లక్ష్మీనారాయణను భీమిలి నుంచి పోటీకి నిలపాలని చంద్రబాబు భావనగా కొందరు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే, ఆయన ఆలోచించుకొని నిర్ణయం చెబుతానన్నారట.

అంతేకాదు, భీమిలి లేదా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. దీంతో పవన్‌పై పోటీ చేయ‌టం కంటే సీటు మార్చుకోవ‌టం ద్వారా అన్ని ర‌కాలుగానూ ప్రయోజ‌నం ఉంటుంద‌ని వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక‌, వైసిపి నుంచి అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఆయ‌నకు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉంది. 2009 లో ప్రజారాజ్యం తరపున గెలుపొందారు. దీంతో, గ‌ట్టి అభ్యర్ధులు పోటీలో ఉండ‌టంతోనే చివ‌రి నిమిషంలో సేఫ్ సీటుగా భావించి విశాఖ‌-తూర్పు ఖ‌రారు చేసిన‌ట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా రకరకాలుగా లోకేష్‌ విశాఖ నార్త్‌పై చర్చ జరుగుతోంది. మొత్తానికి విశాఖ నార్త్ నుంచి లోకేష్‌ను పోటీ చేయడం ద్వారా, చుట్టూ పక్కల నియోజకవర్గాల్లోనూ ఊపు తేవాలని లెక్కలేస్తున్నారు చంద్రబాబు. అన్నింటికీ మించి ఇదొక సేఫ్‌ సెగ్మెంట్‌గా ఆలోచిస్తున్నారు. మరి విశాఖ నార్త్‌ నుంచి నారా లోకేష్‌ సత్తా చాటుతారా? చినబాబును జనం ఆదరిస్తారా?

Next Story


లైవ్ టీవి