logo

నంద్యాల ప్రజలు పట్టం కట్టేది ఎవరికో..?

నంద్యాల ప్రజలు పట్టం కట్టేది ఎవరికో..?

ఈ సారి నంద్యాల ఓటర్లు ఏ గట్టున ఉంటారు అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. సర్వేలకు అర్ధం కాని, అంచనాలు అందుకోలేని నంద్యాల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న భయం నేతలకు పట్టుకుంది. మరి నంద్యాల ఓటర్లు ఏమంటున్నారు. నంద్యాలలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఉప ఎన్నికల తర్వాత నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు ముదిరాయి. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. మంత్రి పదవి దక్కించుకున్న ఎమ్మెల్సీ ఎన్ఎమ్‌డి ఫరూక్ తనకు టికెట్ ఖాయమని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అయితే రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి నంద్యాల టిక్కెట్ రేసులో తానూ ఉన్నానంటున్నారు.

ప్రస్తుత ఎంపి ఎస్పీవై రెడ్డి తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి కాకపోతే ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇక మైనారిటీ లోనుండి అభ్యర్థి‌ని ప్రకటించాలనుకున్న టీడీపీ. ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా ఆ ఆలోచన విరమించుకునట్లు తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల్లో జగన్ ఇళ్ళిళ్ళు తిరిగినా శిల్పా మోహన్ రెడ్డి ఓటమి చవిచూశారు. దీంతో ఈసారి నంద్యాల వైసీపీ అభ్యర్థిగా తన తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్నారు శిల్పా. రవిచంద్ర కిషోర్ రెడ్డికి సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ప్రజల్లో గుర్తింపు ఉన్నప్పటికీ అధికార పార్టీ రాజకీయాల ముందు ఎదురీత తప్పక పోవచ్చు. ముస్లిం, క్రిస్టియన్ ఓట్లతో గట్టెక్కవచ్చిన ఆశించిన వారికి ఈసారి ఆ ఫార్ములా వర్క్ అవుట్ అయ్యేలా కనిపించడం లేదు.

జనసేన పార్టీ తరపున జెండా మోసేందుకు ఒక్కరూ సిద్దంగాలేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అందులో నంద్యాల ఒకటి. అయితే టీడీపీ తరపున టికెట్లు రాని ఆశావహులు జనసేన వైపు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి జనసేన‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నంద్యాల నియోకజకవర్గంలో, ఇలా అన్ని పార్టీలు రకరకాల సమీకరణలతో సమరానికి సై అంటున్నాయి.

లైవ్ టీవి

Share it
Top